Mamata Banerjee: ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు ఢిల్లీలో దీదీ పర్యటన
* ఢిల్లీలో విపక్ష నేతలతో దీదీ భేటీ? * 28న విపక్ష నేతలతో సమావేశమయ్యే ఛాన్స్ * పలు పార్టీల నేతలకు ఆహ్వానం
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. మిషన్ మోడీ ఉద్వాసనకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేయాలని మమతా పట్టుదలతో ఉన్నారు. ఆమెకు హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా బెంగాల్‌లో గెలిచిన తర్వాత ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టంగా అర్థం అవుతోంది. ఇందులో భాగంగా మమత ఢిల్లీ టూర్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇవాళ్టి నుంచి ఢిల్లీలో మమతా బెనర్జీ పర్యటించనున్నారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యూహం రచిస్తున్నారు. కలిసి వచ్చే విపక్ష పార్టీలతో కూటమి ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న పలువురు విపక్ష నేతలతో ఆమె వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఢిల్లీలోని బంగభవన్‌లో ప్రతిపక్ష నేతలతో జరిగే సమావేశానికి ఆయా పార్టీల సీనియర్ ప్రతినిధులను ఆహ్వానించారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 30 వరకు దీదీ ఢిల్లీలో పర్యటించనున్నారు. 28న మధ్యాహ్నం 3 గంటలకు బంగ భవన్‌లో భేటీ జరిగే అవకాశాలున్నాయి. అదే రోజు అంత కు ముందే మమతా బెనర్జీ ప్రధాని మోదీని కలిసేలా షెడ్యూల్ ఉంది.