Bengal: మమతాబెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
Bengal: 48 గంటలపాటు పర్యవేక్షణ అవసరమన్న వైద్యులు
Bengal: కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ఆస్పత్రి వైద్యులు. దుండగుల దాడిలో దీదీ ఎడమ కాలితో పాటు కుడి భుజం, మెడకు తీవ్రగాయాలైనట్టు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత నుంచి.. మమతా ఛాతినొప్పితో పాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని ప్రకటన చేశారు వైద్యులు. మరిన్ని వైద్య పరీక్షలు చేయాలని, 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే మమతా ఉంటారని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ మమతా బెనర్జీపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన అనంతరం.. తిరిగి కారు ఎక్కుతుండగా కొంతమంది దుండగులు.. తనను బలవంతంగా తోశారని, దాడి చేశారని దీదీ ఆరోపించారు. దీంతో నొప్పితో విలవిల్లాడుతున్న సీఎంను వెంటనే కోల్‌కతాలోని ఆస్పత్రికి తరలించగా.. కాలి మడమలో పగుళ్లు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు.
మరోవైపు బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీదీపై జరిగిన దాడి అంతా డ్రామా అని అంటున్నారు బీజేపీ పెద్దలు. మమతపై ఎలాంటి దాడి జరగలేదని, అదంతా నాటకమని దుయ్యబట్టారు. చిన్న ప్రమాదాన్ని దీదీ పెద్దది చేసి చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంకోపక్క.. మమతపై కుట్రపూరితంగానే బీజేపీ దాడి చేసిందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.
మమతపై దాడి ఘటనపై ఈసీని కలిసి, ఫిర్యాదు చేశారు టీఎంసీ నేతలు. మమతాబెనర్జీకి అదనపు భద్రత కల్పించాలని కోరారు. డీజీపీని మార్చిన 24 గంటల్లోనే మమతపై దాడి జరిగిందని, దీని వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.