Mamata Banerjee: సమాఖ్య వ్యవస్థపై ఇది ఒక సర్జికల్ స్ట్రయిక్
Mamata Banerjee: సమాఖ్య వ్యవస్థపై ఇది ఒక సర్జికల్ స్ట్రయిక్ వంటిదంటూ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కు సిఎం మమత లేఖ రాశారు.
Mamata Banerjee: లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్నిఅధికారాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్ మెంట్) బిల్లు 2021ని తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థపై ఇది ఒక సర్జికల్ స్ట్రయిక్ వంటిదంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మమత లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు, రాజకీయ పార్టీలకు తాను లేఖలు రాస్తానని స్పష్టం చేశారు.
బలహీనం చేసేందుకే....
ఢిల్లీ ప్రభుత్వాన్ని పూర్తిగా బలహీనం చేసేందుకే లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలను కల్పించి, ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆయనకు సబార్డినేట్ లా తయారు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనం చేస్తూ, వాటిని మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చేందుకు కేంద్రం యత్నిస్తోందని మండిపడ్డారు. లోక్ సభలో ప్రవేశపెట్టిన నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్ మెంట్) బిల్లు 2021ని సమాఖ్య వ్యవస్థపై సర్జికల్ స్ట్రయిక్ గా అభివర్ణించారు.
బీజేపీ ఓడిపోవడం...
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బీజేపీ తగ్గించే ప్రయత్నం చేస్తుండటం తనకు ఏ మాత్రం ఆశ్చర్యాన్నికలిగించలేదని చెప్పారు. 2014 మరియు 2019 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో బీజేపీ ఓడిపోవడాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేకపోయినా... వారికి చెందిన మరో ప్రతినిధి (లెఫ్టినెంట్ గవర్నర్) చేత ఢిల్లీని పాలించాలనుకుంటున్నారని మండిపడ్డారు.