వైరస్ గుప్పిట్లో మహారాష్ట్ర: అక్టోబర్‌ తర్వాత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి

Update: 2021-03-04 09:47 GMT

వైరస్ గుప్పిట్లో మహారాష్ట్ర: అక్టోబర్‌ తర్వాత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. బుధవారం అక్కడ రికార్డు స్థాయిలో 9వేల 855 కొత్త కేసులు బయటపడ్డాయి. అక్టోబర్‌ తర్వాత ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21లక్షల 79వేల 185కి పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

చివరిసారిగా అక్టోబరు 17న రాష్ట్రంలో రోజు 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తగ్గుముఖం పట్టిన వైరస్‌ ఇటీవల మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా ముంబయి, పుణె, నాగ్‌పుర్‌, ఠాణెల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ముంబయిలో నిన్న ఒక వెయ్యి 121 కొత్త కేసులు వెలుగుచూడగా పుణెలో 857, నాగ్‌పుర్‌లో 924, ఠాణెలో 818 మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు.

బుధవారం అక్కడ మరో 42 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 52వేల 280 మంది కరోనాకు బలయ్యారు. మరోవైపు రికవరీల సంఖ్య కొత్త కేసుల కంటే తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6వేల 559 మంది వైరస్‌ నుంచి కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 20లక్షల 43వేల 349కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 82వేల 343 యాక్టివ్‌ కేసులున్నాయి. అత్యధికంగా పుణె జిల్లాలో 16వేల 491గా ఉన్నాయి. ఆ తర్వాత నాగ్‌పుర్‌లో 10వేల 132, ఠాణెలో 8వేల810 యాక్టివ్‌ కేసులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

Tags:    

Similar News