Coronavirus: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం

Coronavirus: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజే 60వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

Update: 2021-04-08 04:38 GMT

Coronavirus:(Photo The Hans India)

Coronavirus: మహారాష్ట్రను కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో 59,907 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్క రోజే దాదాపు 60వేల కేసులు వచ్చాయన్న మాట. ఇక ఇవాళ 30,296 మంది వ్యాధి నుంచి కోలుకుంటే..322 మంది మరణించారు. అక్కడ రికవరీల కంటే రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా కోవిడ్ బారినపడుతున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 50శాతం పైగా ఒక్క మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి.

మహారాష్ట్రలో ఇప్పటి వరకు 31,73,261 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 26,13,627 మంది కోలుకోగా.. 56,652 మంది మరణించారు. ప్రస్తుతం 5,01,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పుణెలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం చేస్తోంది. ఇవాళ ఆ ఒక్క జిల్లాలోనే 10,907 కొత్త కేసులు నమోదయ్యాయి. 7,832 మంది కోలుకోగా.. మరో 62 మంది మరణించారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో మహారాష్ట్రలో ఇప్పటికే వారంతాపు లాక్‌డౌన్ విధించారు. శని, ఆదివారాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతుంది. రాత్రిళ్లు 9 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ పాటిస్తున్నారు. సినిమా హాళ్లు, పార్క్‌లు, స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. హోటళ్లలో టేక్ అవే సదుపాయం మాత్రమే ఉంది.

ఈ వ్యాధితో మృతి చెందిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సైతం కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బీడ్‌ జిల్లా అంబజోగై పట్టణంలో ఒకే చితిపై 8 మృతదేహాలను అధికారులు దహనం చేశారు. ''అంబజోగై పట్టణంలోని శ్మశానవాటికలో కరోనా రోగుల మృతదేహాలను దహనం చేయబోతే స్థానికులు వ్యతిరేకించారు. దీంతో పట్టణానికి రెండు కిలోమీటర్లు దూరంలోని మాండవా రోడ్డులో మరో స్థలంలో అంత్యక్రియలు నిర్వహించాం'' అని మున్సిపల్‌ మండలి అధికారి అశోక్‌ సాబలే తెలిపారు.

Tags:    

Similar News