Covid-19: ఆ రాష్ట్రాల్లోనే కోవిడ్ మరణాలు ఎక్కువ: లవ్ అగర్వాల్
Covid-19: రోజువారీ కరోనా కేసుల్లో 2.4శాతం పెరుగుదల
Covid-19: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో కేసులు భారీగానే పెరిగిపోతున్నాయి. మరోవైపు మరణాలు కూడా అదేస్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో లక్ష చొప్పున క్రియాశీల (యాక్టివ్) కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, బెంగళూరు, చెన్నై నగరాల్లో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని అన్నారు.
అలాగే రోజువారీ కరోనా కేసుల్లో 2.4శాతం పెరుగుదల కనిపించిందన్నారు. దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి క్రమంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుందన్నారు. మహారాష్ట్రలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు.
కరోనా వ్యాప్తిని ఆయా రాష్ట్రాలు నివారించకపోతే.. వైద్య సేవల నిర్వహణ చాలా కష్టంగా మారుతుందని హెచ్చరించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, దిల్లీ, హరియాణాలో అధిక మరణాలు నమోదవుతున్నందును.. ఆయా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గత వారం రోజుల్లో బెంగళూరు లో 1.49 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని విచారం వ్యక్తం చేశారు. చెన్నైలో ఈ సంఖ్య 38వేలుగా ఉందని, కొలికోడ్, ఎర్నాకుళం, గురుగ్రామ్ జిల్లాల్లోనూ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు.
మే 1 నుంచి 9 రాష్ట్రాల్లో 6.71లక్షల మంది 18-44ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు వ్యాక్సిన్ తీసుకున్నారని అన్నారు. 12 రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏడు రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో 1.5లక్షల యాక్టివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేలా ఆయా రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.