Maharashtra Lockdown: పూర్తి లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర సర్కార్!
Maharashtra Lockdown: కరోనా కల్లోలం అరికట్టాలంటే.. లాక్ డౌన్ తప్పని సరి అని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అభిప్రాయపడ్డారు
Maharashtra Lockdown: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంటే.. ఇక కరోనా దెబ్బకి మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకి 60 వేల నుంచి 70 వేల కొత్త కరోనా కేసులు నమోదవడం భయాందోళనకు గురిచేస్తోంది. ఆస్పత్రిలో బెడ్లు దొరక్క.. సరైన చికిత్స అందక కరోనా రోగులు వైరస్‌కి బలైపోతున్నారు. మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 68 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 500కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.
ఆదివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 68,631 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 503 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 60,473 మంది కరోనాకి బలయ్యారు. మొత్తం రాష్ట్రంలో 6,70,388 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. కరోనా కల్లోలం అరికట్టాలంటే.. లాక్ డౌన్ తప్పని సరి అని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అభిప్రాయపడ్డారు.
అజిత్ పవార్ రాష్ట్రంలో కరోనా కట్టడికోసం నియమ నిబంధనలను మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది అత్యవసర సేవల్లో పాల్గొంటున్నారు. ఈ సంఖ్యను తగ్గించాలని అజిత్ పవార్ సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. దీంతో అత్యవసర సేవల జాబితాలో ఉన్న కిరాణా దుకాణాలను తెరవడానికి ఇచ్చిన సమయాన్ని తగ్గించే యోచనలో ఉంది. మంగళవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కాబట్టి, ఈ సమావేశం రాష్ట్రంలోని వ్యాపారుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పటి వరకూ కిరాణా దుకాణాలు ఉదయం 7 నుండి 11 వరకు తెరిచి ఉంటాయి. ఈ సమయాన్ని తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉంటె.. దానిని వ్యాపారులు వ్యతిరేకించే అవకాశం కూడా లేకపోలేదు.
మరో వైపు దేశంలో కరోనా పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్న తరుణంలో, కేంద్ర స్థాయిలో కదలికలు మొదలయ్యాయి. చర్యలు చేపట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీదారులతో చర్చలు జరపనున్నారు. కేంద్ర మంత్రివర్గం యొక్క ముఖ్యమైన సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ ఏమైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారా అనే విషయం పై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 6 రోజుల లాక్ డౌన్ విధించింది. తెలంగాణ సర్కార్ కూడా రాత్రి సమయంలో కర్ఫ్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.