Maha Shivratri: వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Maha Shivratri: నీటకంఠుడికి ఏకాదశ రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు

Update: 2024-03-08 04:00 GMT

Maha Shivratri: వైభవంగా మహాశివరాత్రి వేడుకలు.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు 

Maha Shivratri: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివనామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ఏకాదశ రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహిస్తున్నారు. ఉపవాస దీక్షలతో స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పలు శివాలయాలను విద్యుత్‌దీపాలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. ఏపీలో శ్రీశైలం, తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నీలకంఠుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దైవ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది. భక్తులతో కిక్కిరిసిన ఆలయ క్యూలైన్లు.. శివస్వాములతో ప్రత్యేక క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు వేకువ జామున నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం నందివాహనంపై స్వామిఅమ్మవార్ల ఆలయ ప్రదక్షిణ, స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి పదిగంటలకు ఆలయంలో నవనందుల పాగాళంకరణ నిర్వహించనున్నారు. రాత్రి 10కి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 12కి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణోత్సవం జరుపనున్నారు.

శ్రీకాళహస్తి, మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆది దంపతులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో శ్రీకాళహస్తీశ్వరాలయం భక్త జనసంద్రంగా మారింది. శివనామ స్మరణతో శ్రీకాళహస్తీశ్వర ఆలయం మార్మోగింది.  

Tags:    

Similar News