జయలలిత ఆస్తులకు వారసులు వాళ్లే.. స్ప‌ష్టం చేసిన కోర్టు..

Update: 2020-05-28 03:08 GMT

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపకు చెందుతాయని హై కోర్ట్ స్పష్టం చేసింది. చెన్నైలో ఉన్న జయలలిత నివాసంలో కొంత భాగాన్ని ఆమె స్మారకంగానూ, మరికొంత భాగాన్ని (వేద నిలయం) ముఖ్యమంత్రి కార్యాలయంగానూ మార్చాలని హైకోర్టు సూచించింది. తమ సూచనలపై సమాధానం ఇవ్వాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. జయలలిత ఆస్తుల పరిరక్షణకు ఓ స్పెష‌ల్ టీమ్ ను ఏర్పాటు చేయవలసిందిగా ఓ లాయ‌ర్ దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది. అంతే కాకుండా తమను వారసులుగా గుర్తించాలంటూ దీపక్, దీప వేసిన పిటిషన్ పై కోర్ట్ సానుకూలంగా స్పందించింది.

జయలలితకు రూ.913 కోట్ల స్థిర, చరాస్తులున్నాయి. ఆమె ఆకస్మిక మరణంతో ఆస్తులకు వారసులు ఎవరన్న అంశం వివాదమైంది. జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రైవేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే తిరుగుబాటు నేత పుహళేంది (ప్రస్తుతం పార్టీతో రాజీ), జానకిరామన్‌ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Tags:    

Similar News