ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా వడ్డించేద్దామన్నట్లుగా గ్యాస్ కంపెనీలు మార్చి 1 రాగానే సిలిండర్ ధరను అమాంతం పెంచేశాయి. గ్యాస్ కంపెనీలు నెలకు రెండు లేదా మూడుసార్లు ధరలను పెంచేస్తూ సామాన్యుల నెత్తిన పిడుగులా గ్యాస్ బండను వేస్తున్నాయి. వరుసగా ఇలా రేట్లు పెంచేస్తుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిత్యావసరాల ధరలు మండుతున్నాయి.
కొద్ది రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు వంట గ్యాస్ ధరల పెంపు కూడా తోడయ్యింది. పెట్రోల్, డీజిల్ ధరలకు పోటీగా వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే నాలుగోసారి గ్యాస్ ధర పెరిగింది. మూడు నెలల్లో ఏకంగా 225 రూపాయలు పెంచేశారు. వంట గ్యాస్ వినియోగదారుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు ధరలు పెంచుతూనే ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగుసార్లు సిలిండర్ ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
సోమవారం సిలిండర్ ధర మరో 25 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర 846.50 నుంచి 871 రూపాయల 50 పైసలకు చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకపోవడంతో వినియోగదారులు మొత్తం ధర చెల్లించి సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరిలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా వంద రూపాయలు పెరిగింది.
ఫిబ్రవరి 4వ తేదీ నుంచి బాదుడు మొదలైంది. అప్పటి వరకు సిలిండర్ ధర 746.50 రూపాయలు ఉండగా నాలుగో తేదీన 25 రూపాయలు పెరగడంతో 771.50కు చేరింది. ఫిబ్రవరి 15న మరోసారి 50 రూపాయలు పెరిగి 821.50కు చేరింది. 25న మరో 25 రూపాయలు పెరగడంతో సిలిండర్ రేటు 846.50కు చేరింది. మార్చి ఒకటో తేదీన మరో 25 రూపాయలు పెరిగడంతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర 871.50కి ఎగబాకింది.