Car On Railway Tracks: రైలు పట్టాలపై రైలుకి ఎదురొచ్చిన కారు.. షాకైన లోకోపైలట్ ఏం చేశారంటే..

Car On Railway Tracks: రైలు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు పెట్టడం, సిమెంట్ దిమ్మెలు పెట్టి రైలు ప్రమాదాలకు కుట్రపన్నిన ఘటనలు ఇటీవల కాలంలో ఉత్తర్ ప్రదేశ్‌లో అనేకం చోటుచేసుకున్నాయి.

Update: 2024-10-06 10:27 GMT

Car On Railway Tracks: రైలు పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు పెట్టడం, సిమెంట్ దిమ్మెలు పెట్టి రైలు ప్రమాదాలకు కుట్రపన్నిన ఘటనలు ఇటీవల కాలంలో ఉత్తర్ ప్రదేశ్‌లో అనేకం చోటుచేసుకున్నాయి. వాటి నుండి రైల్వే శాఖ ఇంకా తేరుకోకముందే తాజాగా యూపీలోనే రైలు పట్టాలపై కారు రైలుకి ఎదురు రావడం ఆ రైలు లోకో పైలట్ షాకయ్యేలా చేసింది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుండి లక్నో వైపు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్‌కి శనివారం ఈ వింత అనుభవం ఎదురైంది. రైలు పట్టాలపై కారు కదులుతుండటం చూసి విస్మయానికి గురైన లోకోపైలట్ వెంటనే తేరుకుని ఎమర్జెన్సీ బ్రేక్స్ వేశాడు. దాంతో రైలు, కారుకి దగ్గరిగా వెళ్లి ఆగిపోయింది. గోండా - లక్నో రైలు సెక్షన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లోకోపైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఉండకపోయి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని రైల్వే అధికారులు తెలిపారు.

కారు రైలు పట్టాలపైకి ఎలా వచ్చిందంటే..

గోరఖ్‌పూర్ - లక్నో ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ ఇచ్చిన సమాచారంతో రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. వారి విచారణలోనే అసలు విషయం తెలిసింది. లక్నో నుండి వస్తున్న కారు ఈ ఘటన జరిగిన సమీపంలోనే ఉన్న ఒక రైల్వే గేటును వేగంగా దాటే క్రమంలో అదుపుతప్పింది. అదుపుతప్పిన కారు రైల్వే లైన్‌పై వెళ్లడం మొదలుపెట్టింది. అనేక ప్రయత్నాలు చేసిన తరువాత, దాదాపు 100 మీటర్ల దూరం వెళ్లిన తరువాత కారు అక్కడికొచ్చి ఆగిపోయింది. అనంతరం భారీ క్రేన్ సహాయంతో కారును రైలు పట్టాలపైనుంచి తొలగించి రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు.

కారు డ్రైవర్‌పై కేసు నమోదు

కారుని నిర్లక్ష్యంగా నడిపి ఈ ఘటనకు కారకుడైన నేరం కింద కారు డ్రైవర్‌పై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే సమయంలో ఈ ఘటన వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలోనూ పోలీసులు కేసుని దర్యాప్తు జరిపిస్తున్నారు. 

Tags:    

Similar News