Nirmala Sitharaman: గూగుల్‌ 2,500 లోన్‌ యాప్స్‌ను తొలగించింది

Nirmala Sitharaman: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో వెల్లడించిన నిర్మలా సీతారామన్

Update: 2023-12-20 12:15 GMT

Nirmala Sitharaman: గూగుల్‌ 2,500 లోన్‌ యాప్స్‌ను తొలగించింది

Nirmala Sitharaman: లోన్ యాప్స్‌పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. లోన్స్ పేరుతో సాధారణ ప్రజలకు ఎర వేసి..ఆ తర్వాత అధిక వడ్డీలతో పట్టి పీడిస్తున్న యాప్స్ పట్ల కఠిన నిర్ణయం తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. లోన్స్ చెల్లించాలని వేధింపులకు గురి చేస్తూ.. వారి ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్న నకిలీ లోన్ యాప్ప్‌పై బ్యాన్ విధించింది. ప్లే స్టోర్‌ నుంచి 2,500 నకిలీ లోన్‌ యాప్స్‌ను రద్దు చేస్తూ.. భారత్ పార్లమెంట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.

టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్‌ మోసాల్లో రుణాలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ ‌ ద్వారా నిమిషాల్లోనే డబ్బు అప్పుగా లభిస్తుందని, ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ మాయలో పడి అప్పుల ఊబిలోకి జారిపోతున్నారు అమాయకులు. ఆ తర్వాత అప్పు తీర్చాలని లోన్ యాప్ నిర్వహకులు చేసే వేధింపులతో ప్రాణాలు కోల్పోతున్నారు. డబ్బు కట్టకపోతే బాధితుల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురి చేసిన ఘటనలు కూడా ఎన్నో చోటు చేసుకున్నాయి.

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ ముసుగులో నకిలీ లోన్‌ యాప్స్‌ కూడా పని చేస్తున్నాయి. వీటి సంఖ్య వేలల్లో ఉంది. ఇవి రుణం కోసం అప్లై చేసుకున్న వ్యక్తి డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని కూడా దొంగిలిస్తున్నాయి. తిరిగి రుణగ్రస్తుడినే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాయి. నకిలీ లోన్‌ యాప్‌ మోసాల కేసులు పెరుగుతుండడంతో అలాంటి యాప్‌లపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ప్రభుత్వ ఆదేశంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 2,500 యాప్‌లను తొలగించింది. ఈ విషయాన్ని ప్రస్తుత పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ‍ ప్రభుత్వం వెల్లడించింది.

తన ప్లే స్టోర్ నుంచి 2,500 పైగా మోసపూరిత రుణ యాప్‌లను గూగుల్ తొలగించిందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో పేర్కొన్నారు. లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు. నకిలీ రుణ యాప్‌లను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఇతర రెగ్యులేటరీ బాడీలతో కలిసి భారత ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. లోన్‌ యాప్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఆమె వెల్లడించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఒక లీగల్ యాప్‌ల వైట్ లిస్ట్‌ను సిద్ధం చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆ జాబితాను గూగుల్‌కు పంపింది. ఆర్బీఐ తయారు చేసిన వైట్‌ లిస్ట్ ఆధారంగా మాత్రమే గూగుల్‌ తన యాప్ స్టోర్‌లో రుణ పంపిణీ యాప్‌లను ఆమోదిస్తుంది. ఈ విధంగా నకిలీ లోన్ యాప్‌లను అరికట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Tags:    

Similar News