ఢిల్లీలో లిక్కర్ సెగలు.. హైదరాబాద్‌లో లీకేజీ ప్రకంపనలు
* మీరు విచారిస్తారా? మీం కూడా విచారిస్తాం?
Delhi: ఢిల్లీలో లిక్కర్ సెగలు రేపుతుంటే.. హైదరాబాద్‌లో TSPSC పేపర్ లీకేజీ ప్రకంపనలు రేపుతోంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పరిస్థితి చూస్తుంటే.. మీరు నోటీసులిస్తే.. మేము ఇవ్వలేమా? అంటూ కౌంటర్‌గా నోటీసులు పంపి, విచారణకు రావాలంటూ ఆదేశిస్తునట్టే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితులు, అనుమానితులకు ఈడీ నోటీసులు పంపుతుంటే.. ఇక్కడ TSPSC పేపర్ లీకేజీ కేసులో స్పీడ్ పెంచిన సిట్, నిందితులకు నోటీసులు జారీ చేస్తోంది. ఇదంతా దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నట్టే కనిపిస్తున్నా... పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న రివేంజ్ వార్ అంటూ చర్చ జరుగుతుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ.. బీజేపీ ఎన్నో విమర్శలు చేసింది. కవిత ఈడీ విచారణపైనా ఆరోపణలు చేసింది. ఇప్పుడు TSPSC పేపర్ లీకేజీ వ్యవహారాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే, పేపర్ లీకేజీలో కీలక నిందితులు కమలం పార్టీ కార్యకర్త అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు, పేపర్ లీకేజీకి సంబంధించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు.. ఆధారాలు ఇవ్వాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది.