G20 Summit 2023: జీ-20 సదస్సుకు సర్వం సిద్ధం.. 40 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

G20 Summit 2023: శుక్రవారం ఢిల్లీకి చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

Update: 2023-09-07 12:10 GMT

G20 Summit 2023: జీ-20 సదస్సుకు సర్వం సిద్ధం.. 40 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

G20 Summit 2023: G20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ అందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 9, 10న రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రపంచ దేశాధినేతలు వస్తుండడంతో కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేసింది. ఆహార భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్, వాతావరణ మార్పులు, తదితర కీలకమైన సమస్యలపై ఈ సదస్సులో చర్చిస్తారు. వీరిలో పలువురు ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

ఈ ఏడాది జీ20కి నాయకత్వం వహిస్తున్న భారత్.. ఆతిథ్యం అదిరిపోయేలా చర్యలు తీసుకుంది. భారతదేశ సంప్రదాయ వంటలను అతిథులకు రుచి చూపించబోతోంది. అలాగే గెస్టుల బస విషయాన్ని కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుంది. ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు రాకుండా చర్యలు తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకుంటారు. న్యూఢిల్లీలోని ఐటిసి మౌర్యలో ఆయన బస చేస్తారు. జీ20 సమావేశాలతో పాటు భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు బైడెన్.

జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకావడం లేదు. చైనా తరపున ఆ దేశ ప్రధాని లి కియాంగ్ పాల్గొంటారు. అతను న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ లో బస చేయనున్నారు. ఇది చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కోసం రిజర్వ్ చేయబడింది, అయితే సమ్మిట్‌కు ఆయన హాజరుకావడం లేని కారణంగా చైనా ప్రధాని లి కియాంగ్ కి తాజ్‌లో వసతి కల్పించారు.

జీ20లో బ్రిటన్ కూడా సభ్యదేశమే కావడంతో భారత సంతతి వ్యక్తి, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తొలిసారిగా భారత్ లో పర్యటించనున్నారు. భారత మూలాలున్న ఓ వ్యక్తి బ్రిటన్ కు ప్రధాని కావడం, ఆ హోదాలో ఇక్కడ పర్యటించడం మనందరికీ గర్వకారణమేనే చెప్పాలి. ప్రధానిగా తొలిసారి విజిట్ చేయబోతున్న సునక్‌కు అదిరపోయే స్వాగతం పలకడంతో పాటు.. ఆతిథ్యం అదిరిపోయేలా న్యూ ఢిల్లీలోని షాంగ్రి-లా ఈరోస్‌లో బసను ఏర్పాటు చేశారు.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో బస చేయనున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌కు ఒబెరాయ్ హోటల్‌లో రిజర్వ్ చేయబడింది. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు న్యూఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్‌లో బస ఏర్పాట్లు చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ బస కోసం క్లారిడ్జెస్ హోటల్ రిజర్వ్ చేయబడింది. ఇటాలియన్ ప్రతినిధి బృందం హయత్ రీజెన్సీలో ఉంటుంది. సౌదీ అరేబియా ప్రతినిధి బృందం గురుగ్రామ్‌లోని లీలా హోటల్‌లో బస చేయనుంది.

G20లో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ ఉన్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ సభ్యదేశాలుగా ఉన్నాయి. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్ మరియు UAE ఆహ్వానించబడిన దేశాలుగా ఉన్నాయి. 

Tags:    

Similar News