బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో లాలూ కొంతకాలంగా బాధపడుతున్నారు.
లాలూ కిడ్నీలు 75శాతం చెడిపోయాయని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి డయాలలిస్ చేస్తామంటున్నారు. పరిస్థితి ఏ క్షణంలోనైనా విషమించే అవకాశం ఉందన్నారు. దీంతో లాలూ చిన్నకుమారుడు తేజస్వి యాదవ్, లాలూ సతీమణి రబ్రీ దేవి ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి రాంచీ వెళ్లారు. లాలూ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆయనను మరో ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు.