Vizag Steel Plant: విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్ మద్దతు
Vizag Vteel Plant: విశాఖ లో ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అవసరం అయితే విశాక వెళ్లి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేసేలా ఉందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''తెలంగాణలోని బయ్యారంలో సెయిల్ ద్వారా ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ, విశాఖలో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగులందరికీ అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ ఆనుమతితో వైజాగ్ వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తాం. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం.. మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు.. రేపు బీహెచ్‌ఈఎల్ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటు పరం చేయండి అంటారు. ఏమైనా చేస్తారు. ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తాం.. తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం జరిగితే వారు కూడా మాతో కలిసిరావాలి'' అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామని పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి చేసిన ప్రకటనతో ప్రారంభమైన నిరసనలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. స్టీలుప్లాంటు ఉద్యోగుల ఆందోళన, ఆగ్రహం, నిరసనలతో మంగళవారం విశాఖ నగరం హోరెత్తింది. ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులను దిగ్బంధించడంతో రవాణా స్తంభించింది. ఉన్నతాధికారులు ఎవరూ కదలకుండా స్టీలుప్లాంటులోని పరిపాలన భవనాన్ని చుట్టుముట్టి, దారులు మూసేశారు. అదే సమయంలో అక్కడికొచ్చిన డైరెక్టర్ వేణుగోపాలరావును 6 గంటల పాటు నిర్బంధించారు. ఈ ఉద్యమానికి కేటీఆర్ ప్రకటన మరింత బలాన్నిచ్చినట్టైంది. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు తెలుగు రాష్ట్రాలు ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పినట్టైంది.