Kolkata Doctor Rape and Murder Case: ఆర్.జి. కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ IMA సభ్యత్వం రద్దు..!
Kolkata Doctor Rape and Murder Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్, హత్య కేసులో ఆర్.జి. కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది
Kolkata Doctor Rape and Murder Case: కోల్‌కతా ఆర్.జి. కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ట్రైనీ డాక్టర్ రేప్, హత్య జరిగిన సమయంలో ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీఫ్ ఘోష్‌కు సోమవారం నాడు లై-డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలో మహిళ మృతదేహం కనిపించిన తరువాత కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆయన నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి.
డాక్టర్ హత్యకు సంబంధించి ఆయన మీద అభియోగాలు నమోదు కాలేదు. కానీ, ఆయన నాన్-బెయిలబుల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్.జి. కార్ ఆస్పత్రిలో అవినీతి దారుణంగా ఉందని, మృత దేహాలు, వైద్య సంబంధిత వ్యర్థ పదార్థాల అక్రమ రవాణాలో డాక్టర్ ఘోష్‌కు సంబంధాలున్నాయని ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు ఆరోపించారు. దాంతో, అవినీతి కార్యకలాపాలకు, డాక్టర్ హత్యకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు నమోదయ్యాయి.
కోల్‌కతాలోని ఆయన నివాసంలో సీబీఐ సోదాలు జరిపింది. దాదాపు 90 గంటల పాటు సాగిన ఈ సోదాల తరువాత విలువైన సమాచారం సేకరించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఆర్.జి.కార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్య ఘటనలో సందీఫ్ ఘోష్ మొదటి నుంచీ కేంద్ర బిందువుగా ఉన్నారు. ఆ దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
ఆయన రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే బెంగాల్ ప్రభుత్వం ఆయనను కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజి అండ్ హాస్పిటల్ (CNMS) హెడ్‌గా నియమించింది. దాంతో, CNMS లో తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. వెంటనే కోల్‌కతా హైకోర్టు జోక్యం చేసుకుని ఆయనను లాంగ్ లీవ్ మీద వెళ్ళాల్సిందిగా ఆదేశించింది. డాక్టర్ ఘోష్‌కు అండగా నిలబడ్డారా అని కూడా కోర్టు ఈ సందర్భంలో పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరకు సుప్రీం కోర్టు కూడా డాక్టర్ హత్యలో ఆయన పాత్రను నిలదీసింది. పోలీసు కేసు పెట్టటడంలో ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.