Sabarimala Ayyappa: శబరిమల భక్తులకు ఉచితంగా రూ. 5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్
Life Insurance to Sabarimala Ayyappa Devotees: శబరిమల వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 5 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ అందించనున్నట్లు కేరళ సర్కారు ప్రకటించింది.
Life Insurance to Sabarimala Ayyappa Devotees: శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం కేరళ సర్కారు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 5 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ అందించనున్నట్లు కేరళ సర్కారు ప్రకటించింది. శబరిమలలో దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రమాదవశాత్తుగా మృతి చెందితే వారి కుటుంబానికి రూ. 5 లక్షల బిమా అందించనున్నారు.అంతేకాకుండా భౌతికదేహాన్ని భక్తుల ఇంటికి చేర్చే బాధ్యతను కూడా కేరళ ప్రభుత్వం తీసుకుంటోంది. కేరళ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కి అవరసమైన ప్రీమియంను ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు చెల్లించనుంది.
నవంబర్ రెండో వారం నుండి అయ్యప్ప దీక్షలు ప్రారంభమవుతాయి. అయ్యప్ప భక్తుల కోసం జరుగుతున్న ఏర్పాట్లపై తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో ఒక సమీక్షా సమావేశం జరిగింది. శబరిమల యాత్రలో అనేక శాఖలు కలిసి సమన్వయం చేయనున్నందున ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలోనే సీఎం విజయన్ ఈ ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్ణయం తీసుకున్నారు.
శబరిమలలో నవంబర్ 16 నుండి అయ్యప్ప భక్తులకు దర్శనం ప్రారంభం కానుంది. డిసెంబర్ చివరి వారంలో తాత్కాలికంగా ఆలయాన్ని మూసేసి మళ్లీ వెంటనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అప్పటి నుండి మళ్లీ జనవరి నెల మూడో వారం వరకు భక్తుల కోసం అయ్యప్ప ఆలయం ద్వారాలు తెరిచే ఉంటాయి. కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీ.ఎన్.వాసవన్ మీడియాతో మాట్లాడుతూ, ఒక్క భక్తులు కూడా అయ్యప్ప దర్శనం లేకుండా తిరిగి వెళ్లొద్దనే సంకల్పంతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
14000 మంది పోలీసు బలగాలు, వాలంటీర్స్
అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం మొత్తం 14000 మంది పోలీసులను మొహరిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. వీళ్లే కాకుండా స్వచ్చందంగా ముందుకొచ్చే వాలంటీర్స్ కూడా సెక్యురిటీ విధుల్లో ఉండనున్నారు. అయ్యప్ప భక్తుల కోసం పార్కింగ్స్ స్లాట్స్ పెంచడం జరిగిందని, అలాగే ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే పరిష్కరించేలా వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండనున్నట్లు మంత్రి వాసవన్ తెలిపారు. ఇప్పటికే అయ్యప్ప దర్శనం కోసం ఆన్ లైన్ టికెట్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఇదే కాకుండా ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోకుండా నేరుగా వచ్చే వారికోసం నిత్యం 10 వేల టికెట్స్ ఇవ్వనున్నట్లు మంత్రి వాసవన్ స్పష్టంచేశారు.