కాశ్మీర్‎లో బతకలేమంటూ వెళ్లిపోతున్న హిందూ కుటుంబాలు

*కాశ్మీర్ లోయను వీడిపోతున్న హిందూ కుటుంబాలు

Update: 2022-06-02 14:00 GMT

కాశ్మీర్‎లో బతకలేమంటూ వెళ్లిపోతున్న హిందూ కుటుంబాలు

Kashmiri Pandits: కాశ్మీర్‎లో టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. హిందూ పండిట్లు, ప్రభుత్వ ఉద్యోగులను ఏరి మరీ చంపుతున్నారు పాక్ టెర్రరిస్టులు. తాజాగా రాజస్థాన్ కు చెందిన విజయకుమార్ అనే ఓ బ్యాంక్ ఉద్యోగిని కుల్గామ్ లో కాల్చి చంపారు. వరుస హత్యలతో హిందూ కుటుంబాలు భీతిల్లుతున్నాయి. ప్రభుత్వ రక్షణ ఏర్పాట్లపై విశ్వాసం సడలింది. దీంతో వారు కాశ్మీర్ లోయను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

కాశ్మీర్‎లో ఉగ్రమూకను ఏరివేస్తున్న బలగాల ఆపరేషన్లు హిందూ కుటుంబాల్లో భరోసా నింపలేకపోతున్నాయి. కళ్లముందే జరుగుతున్న వరుస హత్యలతో వారి ఆత్మవిశ్వాసం సడలుతోంది. కాశ్మీర్ లో ఉండి బతకడం అనేది వారికి దుర్లభంగా కనిపిస్తోంది. అందుకే సురక్షితమైన ప్రాంతాలకు పయనమవుతున్నారు. పిల్లా జెల్లా, తట్టా బుట్టా సర్దుకొని ప్రాణాల మీద తీపితో కాశ్మీర్ లోయను వీడి జమ్మూ రీజియన్ కు తరలిపోతున్నారు. బారాముల్లాలోని ఒకే ప్రాంతంలో ఉండే దాదాపు 350 కుటుంబాల నుంచి 100కు పైగా ఇప్పటికే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ అక్కడే మొండిధైర్యంతో ఉన్నవాళ్ల హృదయాల్లోనూ అనుమానాలు రేగుతున్నాయి. తాము కూడా వెళ్లిపోక తప్పదన్న భావనలోకి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభుత్వం తలపెట్టిన ఏరివేత ఆపరేషన్ ఉద్దేశం నెరవేరకుండా పోతుందా అన్న అనుమానాలు రేగుతున్నాయి.

కాశ్మీర్ లోని కుల్గామ్ లో విజయ్ కుమార్ అనే బ్యాంక్ ఎంప్లాయీని టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ హత్యను తామే చేశామని లష్కరే తొయిబా ప్రకటించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. విజయ్ కుమార్ రాజస్థాన్ నుంచి వచ్చి బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగులను చంపినట్టయితే కాశ్మీర్ కు వచ్చి ఉద్యోగం చేయడానికి ఎవరూ ముందుకు రారని, టెర్రరిస్టులకు అదే కావాలని, అందుకే ఏరి చంపుతున్నారంటున్నారు. కొన్ని గంటల ముందే ఇదే కుల్గామ్ లో రజనీ బాలా అనే గవర్నమెంట్ టీచర్ ను చంపేశారు. ఒక్క మే నెలలోనే ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులను పొట్టన పెట్టుకున్నారు ముష్కరులు. మే 12న రాహుల్ భట్, 24వ తేదీన సఫీ ఉల్లా అనే పోలీసాఫీసర్, 25వ తేదీన అమ్రీన్ భట్ అనే టీవీ యాంకర్ ను, 28వ తేదీన ముదాసిర్ అనే ఇంకో పోలీసాఫీసర్ ను తుపాకీ గుళ్లకు బలి చేశారు. ఈ హత్యలను కాశ్మీరీ పండిట్లు తీవ్రంగా నిరసిస్తున్నారు.

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తేసిన తరువాత స్థానిక ప్రజల్లో భరోసా నింపేందుకు బలగాలను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ఏరివేత కూడా చాలా పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 100 మంది టెర్రరిస్టులను బలగాలు కాల్చివేశాయి. అయినా ప్రభుత్వ వ్యవస్థ మీద అపనమ్మకం కలిగించాలన్న కుట్రతో పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు వ్యూహాత్మకంగా హిందువులను, ప్రభుత్వ ఉద్యోగులను కాల్చి చంపడం మీద కాన్సంట్రేషన్ చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీనికి ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

Tags:    

Similar News