Kartarpur corridor: రెండు రోజుల ముందు సమాచారం.. పాక్‌పై మండిపడ్డ భారత్

kartarpur corridor: జూన్ 29 నుంచి కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి ప్రారంభిస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి శనివారం చెప్పారు. ఇందుకు సంబంధించి సమాచారాన్ని కూడా భారతదేశానికి ఇచ్చినట్టు చెప్పారు.

Update: 2020-06-27 13:13 GMT

జూన్ 29 నుంచి కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి ప్రారంభిస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి శనివారం చెప్పారు. ఇందుకు సంబంధించి సమాచారాన్ని కూడా భారతదేశానికి ఇచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మహారాజా రంజిత్ సింగ్ మరణ వార్షికోత్సవం జరపనున్నట్టు వెల్లడించారు. కర్తార్‌పూర్ కారిడార్ 9 నవంబర్ 2019 న ప్రారంభమైంది.

అయితే భారత్, పాకిస్థాన్ దేశాల్లో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 16 న తాత్కాలికంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను మూసివేశారు. అయితే దీనిపై పంజాబ్‌ ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పౌరులకు కూడా కర్తార్‌పూర్ సాహిబ్‌లోకి ప్రవేశం ఉందని.. వీరు కూడా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారని.. అందువల్ల భారతీయ యాత్రికులు కూడా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవాలంటే వారం రోజులు ముందు భారత్ కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కేవలం రెండు రోజులు ముందు మాత్రమే తెలియజేయటంతో.. పేర్లు నమోదుకు భారత్ కు తగిన సమయంలేకపోవడంతో భారత్ మండిపడుతోంది.

అంతేకాదు ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ తన వైపు ప్రవహించే రవి నదిపై వంతెనను నిర్మించాల్సి ఉంది. కానీ, పాకిస్థాన్ మాత్రం వంతెనను పూర్తి చెయ్యలేదు. ఈ వంతెన సిక్కు భక్తుల ప్రయాణాన్ని సురక్షితంగా మరియు తేలికగా ఉండేలా చేస్తుంది. వర్షాకాలంలో ఇది మరింత ముఖ్యమైనదిగా ఉంటుంది.

మరోవైపు మహారాజా రంజిత్ సింగ్ మరణ వార్షికోత్సవం సందర్భంగా చాలా సంవత్సరాలుగా 250 మంది సిక్కుల బృందం లాహోర్ వెళుతోంది. అయితే, ఈసారి పాకిస్తాన్.. సిక్కులను వీసాల కోసం ఆహ్వానించలేదు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సిక్కు భక్తులు కూడా భారత హైకమిషన్‌ను సంప్రదించలేదు.   

Tags:    

Similar News