CM Siddaramaiah: ముఖ్యమంత్రిపై కేసు విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్థలాల కేటాయింపు విషయంలో భారీ కుంభకోణం జరిగింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-17 05:57 GMT

CM Siddaramaiah in MUDA scam case: బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారా అంటే అవుననే తెలుస్తోంది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల కేటాయింపు విషయంలో భారీ కుంభకోణం జరిగింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కర్ణాటకలో ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపి, జేడీఎస్ పార్టీలు గతంలోనే ఆ రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లట్‌కి కూడా ఫిర్యాదు చేశాయి.

తాజాగా ఈ కేసు విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రశ్నించేందుకు గవర్నర్ థావర్చంద్ గెహ్లట్ శనివారం అనుమతి ఇచ్చినట్టుగా పీటీఐ కథనం పేర్కొంది.

ఇదిలావుంటే, ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య గతంలోనే స్పందించారు. కేవలం తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ప్రతిపక్షాలు తనకు మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ స్కామ్‌కి లింకు పెడుతూ ఆరోపణలు చేస్తున్నాయని, కానీ అలాంటి ఆరోపణలకు తాను భయపడే రకం కాదు అని స్పష్టంచేశారు.

ప్రతిపక్షాలు సైతం తాము చేస్తోన్న ఆరోపణలపై వెనక్కి తగ్గడం లేదు. సీఎం సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు సైతం చేస్తున్నాయి.

అసలు ఏం జరిగిందంటే..

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వివిధ అభివృద్ధి పనుల కోసం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన వారికి మరొక చోట భూములు కేటాయించింది. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి కూడా మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మరొక చోట స్థలం కేటాయించింది. కాగా పార్వతి స్థలం కోల్పోయిన ఏరియా కంటే అత్యంత ఖరీదైన ప్రాంతంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని ఆమెకు మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కేటాయించిందని, ఇది కేవలం సిద్ధరామయ్య తన పలుకుబడితో పావులు కదపడం వల్లే జరిగింది అని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  

Tags:    

Similar News