karnataka drugs racket case : పరారీలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావమరిది
కర్ణాటకలో సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. అందులో భాగంగా బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ముందు మరో నటి ఇంద్రితా రాయ్ దంపతులను కూడా విచారిస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సిసిబి కార్యాలయంలో హాజరు కావాలని నిన్న ఇంద్రితా రాయ్, ఆమె భర్త దిగంత్ ఇద్దరికీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో తాము విచారణకు హాజరు అవుతామని ఇంద్రితా రాయ్ దంపతులు స్పష్టం చేశారు. మరోవైపు క్యాసినోలకు రావాలంటూ ప్రకటనలో కనిపించిన నటీనటులు అందరికీ నోటీసులు జారీ చేసేందుకు దర్యాప్తు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన సినీ నటి సంజన స్నేహితుడు రాహుల్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక్ తో కలిసి ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.. మంత్రికి రాహుల్ తో సంబంధాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో వదంతులు వస్తున్నాయి.
అయితే ఈ విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి అశోక్ స్పష్టం చేశారు. ఓ కార్యక్రమంలో రాహుల్ కు అశోక్ మిఠాయి తినిపిస్తున్నట్టుగా ఫోటో వెలుగులోకి రావడంతో మంత్రి పై ఆరోపణలు వచ్చాయి. దీంతో విపక్షాలు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఇదిలావుంటే డ్రగ్స్ సరఫరా, వ్యాపార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆల్వా నివాసంపై సీసీబీ అధికారులు దాడి జరిపారు.. దాడిలో పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని మాదకద్రవ్యాలను, పార్టీలకు సంబంధించిన వివరాలను పోలీసులు గుర్తించారు. అయితే ఆదిత్య ఇంట్లో వీకెండ్ పార్టీలు నిర్వహించే వారమని కీలక నిందితుడు రవిశంకర్ పోలీసులకు తెలిపాడు.. రవిశంకర్ అరెస్టుతో ప్రస్తుతం ఆదిత్య ఆళ్వా పరారీలో ఉన్నారు.