మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా వద్ద ఉన్న పాలి హిల్ లోని తన భవనాన్ని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చడంపై హీరోయిన్ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. శివసేన వర్సెస్ కంగనాగా ఈ వ్యవహారం మారిపోయింది. కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసిన ఘటనలో మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే సలహాదారు అజయ్ మెహతాకు ఫోన్ చేసిన కొషియారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కంగన ఆఫీసు కూల్చివేత, ఇతర పరిణామాలపై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని గవర్నర్ కొషియారీ నిర్ణయించారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కంగనా ఆఫీస్ కూల్చివేత చర్యను ఇప్పటికే ఖండించారు. ఇదిలా ఉంటే ఆఫీస్ కూల్చివేత అనంతరం కంగనా కూడా శివసేనపై రాజకీయ విమర్శలు పెంచింది. బీజేపీ- శివసేన మధ్య కోల్డ్‌వార్‌కు దారి తీసిన ఈ ఘటనలో చాలా మంది నెటిజన్లు కంగన వైపే నిలబడి ఆమెకు మద్దతు ప్రకటించారు. ఇదొక కక్షపూరిత చర్య అంటూ ఠాక్రే సర్కారును విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్రంగా స్పందించిన కంగనా.. ''ఈరోజు నా ఇంటిని కూల్చారు. రేపు మీ అహంకారం కూలుతుంది'' అంటూ మండిపడ్డారు.