KA Paul: 21నుండి ఢిల్లీలో కేఏ పాల్ ఆమరణ దీక్ష
KA Paul: సాగు చట్టాలకు, స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 21 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు.
KA Paul: సాగు చట్టాలకు, విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 21 నుంచి ఢిల్లీలో నిరవధిక ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను గురువారం ఆయన ఢిల్లీలో కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్‌తో కలిసి ఇక్కడ ఏపీ భవన్లో పాల్ విలేకర్లతో మాట్లాడారు. సాగుచట్టాలను తక్షణమే కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, రైతులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీకేయూ రైతు నేత తికాయత్ తెలిపారు. విశాఖ ఉక్కు కార్మికులకు, ప్రజలకు తాము అండగా నిలుస్తామన్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే దాకా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తేలేదని తికాయత్ హెచ్చరించారు.