రోప్ వే ప్రమాదంలో కొనసాగుతున్న సహాయ చర్యలు.. ముగ్గురు మృతి...
Jharkhand Ropeway Accident: రోప్ వే క్యాబిన్‌లలో చిక్కుకుపోయిన పర్యాటకులు...
Jharkhand Ropeway Accident: జార్ఖండ్ రాష్ట్రం దేవగఢ్ జిల్లాలో జరిగిన రోప్ వే ప్రమాదంలో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లు ప్రమాదానికి గురయ్యాయి. కేబుల్ కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు పర్యాటకులు మృతి చెందగా, 12 మంది గాయాలపాలయ్యారు. హెలికాప్టర్ ద్వారా తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 40 మందిని భారత వాయుసేన రక్షించింది.
ఒకదాని వెంట మరొకటి వెళ్తున్న రెండు కేబుల్ కార్లలో మొదటిది కిందకు జారి వచ్చి వెనకున్న రెండో కేబుల్ కారును బలంగా ఢీకొట్టింది. దేవగఢ్ పట్టణంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మరో ఇద్దరు పర్యాటకులు రోప్ వే మార్గంపై కేబుల్ కార్లలోనే చిక్కుకుని ఉన్నారు. వారిని కాపాడే రెస్క్యూ ఆపరేషన్ 40 గంటలుగా కొనసాగుతోంది.
రెండు హెలికాఫ్టర్లు, సైనికులు చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రెస్య్యూ ఆపరేషన్‌లో కలిసి పనిచేస్తున్నాయి. కేబుల్ కార్లలో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లను అందిస్తున్నామని అధికారులు తెలిపారు. మొత్తంగా ఈ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.