JEE, NEET 2020: కరోనా కారణంగా ఆగిపోయిన ప్రవేశపరీక్షలకు ఎట్టకేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే నీట్, జేఈఈ పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేయగా తాజాగా పరీక్షల నిర్వహణకు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. పరీక్షల నిర్వహణకు కేంద్రం విధించిన నిబంధనలు ఏంటి..? పరీక్షలను ఎలా నిర్వహించబోతున్నారు..?
కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు సార్లు వాయిదా అనంతరం సెప్టెంబర్ 13న జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు మార్గదర్శకాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. గైడ్ లైన్స్ ప్రకారం ఎగ్జామ్ సెంటర్‌లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఉంచనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు 99.4 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లు తేలితే వారికి ఐసోలేషన్ గదిలోనే పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి కూడా ఐసోలేషన్ గదిలోనే పరీక్ష నిర్వహిస్తారని పేర్కొంది.
కరోనా నేపథ్యంలో విద్యార్థులందరూ గుంపులుగా రాకుండా స్లాట్ల విధానం అమలు చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఏ సమయంలో రావాలో హాల్‌టికెట్లపైనే ముద్రిస్తారు. విద్యార్థుల సెల్‌ఫోన్లకు ఆయా వివరాలను మెసేజ్ రూపంలో పంపిస్తారు. థర్మోగన్స్ ద్వారా ఎంట్రన్స్‌లో టెంపరేచర్‌ను చెక్ చేస్తారు. అత్యవసరమైతే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు అదికారులు. ఇక పరీక్షలకు వచ్చే విద్యార్థులు మాస్క్, శానిటైజర్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్షకు 15 లక్షల 97వేల 433 మంది హాజరు కానుండగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.