Karnataka Results 2023: గల్లంతైన కింగ్‌మేకర్ ఆశలు.. జేడీఎస్‌ చీఫ్‌ ఆశలపై నీళ్లు చల్లిన ప్రజలు..

Karnataka Results 2023: పదికి పైగా సర్వేలు... హంగ్‌ వస్తుందని వెల్లడించాయి.

Update: 2023-05-13 14:45 GMT

Karnataka Results 2023: గల్లంతైన కింగ్‌మేకర్ ఆశలు.. జేడీఎస్‌ చీఫ్‌ ఆశలపై నీళ్లు చల్లిన ప్రజలు..

Karnataka Results 2023: పదికి పైగా సర్వేలు... హంగ్‌ వస్తుందని వెల్లడించాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌కు గానీ.. బీజేపీకి గానీ.. స్పష్టమైన మెజార్టీ రాదని అంచనా వేశాయి. దీంతో కింగ్‌ మేకర్‌గా జనతాదల్‌-ఎస్‌ ఆవిర్భవిస్తుందని విశ్లేషించాయి. ఇదే జనతాదల్‌ చీఫ్‌ కుమారస్వామికి ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. తానే కింగ్‌ మేకర్‌ అవుతానని ఆయన అంచనా వేసుకున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఎవరు ఇస్తే.. వారితో కలవాలని వ్యూహాలను కూడా రూపొందించుకున్నారు. అయితే కుమారస్వామి ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు.. కింగ్‌ మేకర్‌ కాస్తా.. కామ్‌ మేకర్‌గా మారారు.

2018 నాటి ఫలితాలే రిపీట్‌ అవుతాయని.. కర్నాటక అసెంబ్లీకి ఈనెల 10న జరిగిన ఎన్నికలపై పదికి పైగా ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు వెల్లడించాయి. అంటే.. కన్నడనాట ఈసారి కూడా హంగ్‌ తప్పదంటూ విశ్లేసించాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీకి స్పష‌్టమైన మెజార్టీ రాదంటూ తేల్చి చెప్పాయి. జనతాదల్‌ సెక్యూలర్-జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా మారుతుందంటూ ఊదరగొట్టాయి. ఈ సర్వేలతో... జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామికి కొత్త ఉత్సాహం వచ్చింది. ఆశలన్నీ హంగ్‌పైనే పెట్టుకున్నారు. మద్దతు ప్రకటించాలంటే సీఎం పదవి కోసం డిమాండ్‌ చేయాలని భావించారు. ఒకవైపు కాంగ్రెస్‌తోను, మరోవైపు బీజేపీతోనూ చర్చలు జరిపారు. హంగ్‌ ఫలితం వచ్చినా.. కప్పు మాత్రం బీజేపీదేనని కమలనాథలు వ్యాఖ్యలు చేయడంతో.. జేడీఎస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారన్న వాదనలకు మరింత బలాన్ని ఇచ్చింది. కానీ.. తాజా ఫలితాలు.. జేడీఎస్‌కు అంత సీన్‌ లేదని తేల్చి చెప్పాయి. కింగ్‌ మేకర్‌కు నిరాశనే మిగిల్చాయి.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్‌ నుంచి కాంగ్రెస్‌ భారీ అధిక్యతనే ప్రదర్శించింది. బీజేపీ ఏ మాత్రం పోటీని ఇవ్వలేకపోయింది. అయితే సుమారు 10 రౌండ్ల కౌంటింగ్‌ వరకు.. మేజిక్‌ ఫిగర్‌ 113కి కాంగ్రెస్‌ సమీపంలోనే ఉంది. దీంతో కుమారస్వామికి ధీమా ఏ మాత్రం సడలలేదు. తామే కింగ్‌ మేకర్‌ అంటూ కుమారస్వామి ప్రకటించారు. కానీ.. జేడీఎస్‌ చీఫ్‌ ఆశలపై కన్నడ ప్రజలు నీళ్లు చల్లారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతామంటే ఒప్పుకోమంటూ కన్నడిగులు తేల్చి చెప్పారు. కింగ్‌ మేకర్‌ అవుతానని అనుకున్న కుమారస్వామికి భారీ షాకే తగిలింది. ప్రజలు కాంగ్రెస్‌కు నీరాజనం పలికారు. అధికార పార్టీ బీజేపీకి కర్రుకాల్చి వాతపెట్టారు. మళ్లీ సీఎం అవుతానని కలలు కన్న కుమారస్వామి... ప్రజల మాత్రం ఊహించలేకపోయారు. ఒకానొక దశలో.. కుమారస్వామి గెలుపుపైనే అనుమానం కలిగింది. చివరికి 17వేల ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఇదిలా ఉంటే సర్వేల ప్రకారం.. 30కి పైగా స్థానాలు వస్తాయని జేడీఎస్‌ అంచనా వేసింది. కానీ జేడీఎస్‌కు కనీసం 20 సీట్లను కూడా అతి కష్టం సాధించిందింది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యలో జేడీఎస్‌ భారీగా అభ్యర్థులను రంగంలోకి దించింది. మొత్తం 224 స్థానాలకు గానూ.. జేడీఎస్‌ 212 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్‌ హవాలో జేడీఎస్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిజానికి జేడీఎస్‌ ప్రచారం కూడా అంతంత మాత్రంగానే చేసింది. దీంతో గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. హంగ్‌ వస్తే.. 2018 నాటి సీన్‌ రిపీట్‌ అవుతుందని ఆశించిన కుమారస్వామి.. గర్వభంగం తప్పలేదు. 2018లో హంగ్‌ వస్తుందని సర్వేలు వెల్లడించాయి. అప్పట్లో బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్‌ 80, జేడీఎస్‌ 37 స్థానాలు గెలుచకున్నాయి. అయితే జేడీఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తమ మద్దతు కావాలంటే.. ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలని అప్పట్లో కుమారస్వామి డిమాండ్‌ చేశారు. అందుకు కాంగ్రెస్‌ కూడా అంగీకరించింది. కుమారస్వామి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అయితే 14 నెలల తరువాత కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. ఈసారి కూడా 2018 నాటి హంగ్‌ వస్తుందని అంచనా వేసినా.. ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టారు. దీంతో జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ఆశలకు గండిపడినట్టయ్యింది. సర్వేలు కూడా తప్పని ప్రజలు తీర్పునిచ్చారు. 

Tags:    

Similar News