తలైవీని మరోసారి రాజకీయాలకు వాడుకుంటున్నారా..? అన్నాడీఎంకే వ్యూహాం ఏంటి?

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టిందా..?

Update: 2021-01-30 14:00 GMT

Jayalalithaa, MG Ramachandran

.తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టిందా..? తలైవి మరణించిన నాలుగేళ్లకు ఆలయం నిర్మించడం వెనుక అంతర్యం ఏంటి..? మరోసారి తమిళ రాజకీయాల్లో జయలలిత కార్డుతోనే పోటీకి అన్నాడీఎంకే అడుగులేస్తోందా..? ఇంతకూ శశికళ పరిస్థితి ఏంటి..? హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత, ఆమె రాజకీయ గురువు ఎంజీఆర్‌కి అంకితమిస్తూ మధురైలో నిర్మించిన స్మారక మందిరాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రారంభించారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ కార్యక్రమం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016లో కన్ను మూసిన తర్వాత ఇలాంటి కార్యక్రమం జరగడం కూడా ఇదే తొలిసారి కావడంతో తమిళనాట తలైవీని మరోసారి రాజకీయాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు.. జయలలిత నీడ లాంటి శశికళ శిక్షా కాలం పూర్తి చేసుకొని... 4 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన సందర్భంలో ఇది జరుగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ మందిరాన్ని రెవెన్యూ శాఖ మంత్రి ఉదయ్ కుమార్ నిర్మించారు. ఆయన్ని జయలలితే... మొదటిసారి క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఆమెపై భక్తిని చాటుకుంటూ... ఎకరంన్నర స్తలంలో మధురైలోని టి కల్లుపత్తి ఏరియాలో 50 లక్షలు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించారు.

 ఇక.. శశికళ విడుదల నేపథ్యంలో అన్నాడీఎంకేలో ప్రకంపనలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు కీలక నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే.. ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం అందుకు నో చెబుతున్నట్లు తెలుస్తోంది. జయ వారసత్వాన్ని మాత్రం ఉపయోగించుకోవాలనే పట్టుదలతో పళనిస్వామి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. జైలు నుంచి విడుదలైన శశికళ విషయంలో ఎలాంటి వ్యూహం రచిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

 తమిళనాట రాజకీయాలు ఇప్పటివరకు ఒక ఎత్తైతే.. ఇప్పుడు మరో ఎత్తని చెప్పాలి. ఓ వైపు శశికళ విడుదల.. మరోవైపు రంగంలోకి కమల్.. ఇంకోవైపు హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తాడనే అంచనాలు.. వీటన్నింటికంటే సీరియస్ యాక్షన్‌లోకి దిగిన డీఎంకే. ఇన్ని ప్రతికూలతలు ఉన్న నేపథ్యంలోనే పళని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే.. ప్రజలు ఎవరివైపు అన్నది ఎన్నికల ఫలితాల్లోనే తేలుతుంది.


Tags:    

Similar News