ఆసక్తి రేపుతున్న జనసేనాని పవన్ ఢిల్లీ టూర్!
* ఢిల్లీ పర్యటనలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ * సేనాని టూర్‌పై రాజకీయంగా చర్చ * జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులను కలవనున్న పవన్ * ఏపీ వ్యవహారాలు, జీహెచ్‌ఎంసీ, తిరుపతి ఉప ఎన్నికపై చర్చించే ఛాన్స్ * ప్రధాని మోడీ, అమిత్‌షాను కూడా కలిసే అవకాశం
జనసేనాని పవన్‌కల్యాణ్ హస్తిన టూర్ ఆసక్తి రేపుతోంది. సేనాని ప్లాన్ ఏంటనే చర్చ మొదలైంది. ఇటీవల ఏపీలో పర్యటనలు.. జీహెచ్‌ఎంసీలో బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేనాని హస్తిన ప్రయాణం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌తో పాటు ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవనున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రులను కూడా పవన్ కలిసే ఛాన్స్ ఉంది. ఏపీలోని తాజా పరిస్థితులను కేంద్ర పెద్దలకు పవన్ వివరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు అగ్రనేతల అపాయింట్‌మెంట్స్ ఖరారు అయినట్లు తెలుస్తోంది.
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ ప్రచారంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంపై కేంద్ర పెద్దలతో భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చి, పోటీ నుంచి విరమించుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయాలని బీజేపీ అగ్రనేతలు పవన్‌ను కోరారు. ఈ తరుణంలో పవన్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
మరోవైపు తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికపై బీజేపీ అగ్రనేతలతో పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ- జనసేన కూటమి అభ్యర్థిని ప్రకటించే విషయంపై ఈ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. ఇక ఇటీవల అమరావతి రైతులను కలిసిన సేనాని వారికి అన్ని రకాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై కూడా పవన్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.