Jammu and Kashmir Terror Attack: బీజేపీ నేత, అతని కుటుంబ సభ్యులను కాల్చి చంపిన ఉగ్రవాదులు
Jammu and Kashmir Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. బీజేపీ నేత షేక్ వాసిం బరీ, ఆయన తండ్రి, సోదరుడిని నిన్న రాత్రి కాల్చి చంపారు. బందిపోర్‌లో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ దుకాణంలో షేక్ వాసిం తన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్ కూర్చొని ఉండగా వారిపై బుధవారం రాత్రి ఉగ్రవాదులు దాడిచేశారు. వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అక్కడకుచేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ముగ్గురు చనిపోయినట్టు డాక్టర్ లు నిర్ధారించారు.
ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. అయితే వాసిం కుటుంబానికి 8 మంది భద్రతా సిబంది రక్షణగా ఉన్నారని కానీ కాల్పులు జరుపుతున్న సమయంలో ఒక్కరూ లేకపోవడం గమనార్హం అని పోలీసులు అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన గార్డులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. కాశ్మీర్ ఘటనపై ప్రధానిమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ ట్వీట్ చేశారు. వాసిం మరణం పార్టీకి తీరని లోటని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆవేదన వ్యక్తం చేశారు.