కల్కి ఆశ్రమంలో నాలుగో రోజు కొనసాగిన ఐటీ సోదాలు
కల్కి ఆశ్రమంలో నాలుగో రోజు కొనసాగిన ఐటీ సోదాలు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వెల్‌నెస్ సెంటర్‌లో అణువణువూ సోధించిన అధికారులు ప్రకటన విడుదల చేసిన ఐటీ శాఖ
కల్కి ఆశ్రమంలో నాలుగో రోజు ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. సుమారు 100 కోట్ల వరకు నగదు, నగలు, వజ్రాలు, ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. వెల్ నెస్ టెంపుల్ లో అణువణువూ శోధించారు. మొత్తం మీద 500 కోట్లకు సంబంధించిన ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నట్లు.. ఐటీ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే కల్కీ దంపతులు ఇంకా అందుబాటులోకి రాలేదని సోదాలింకా కొనసాగుతున్నాయని ప్రకటనలో పేర్కొంది.
కల్కి భగవాన్ ఆశ్రమంపై ఐటీ అధికారుల సోదాల్లో వేల కోట్ల అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. ఐటీ దాడుల్లో చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వేల ఎకరాల భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే వంద కోట్ల వరకూ నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఏపీ, తమిళనాడు సహా ఆఫ్రికా దేశాల్లోనూ భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.
కల్కి భగవాన్ ఆశ్రమంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కల్కి ఆశ్రమం చాలా కాలంగా చీకటి సామ్రాజ్యానికి చిరునామాగా మారిందని స్థానికులు అంటున్నారు.వేలాది ఎకరాల భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని వారు చిరునామాలతో సహా వివరిస్తున్నారు.
కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ దాసాజీ నిర్వహిస్తున్న పలు వ్యాపారులపై ఐటీ అధికారులు ఫోకస్ చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన 300 మంది ఐటీ అధికారులు అలుపెరుగకుండా సోదాలు చేస్తున్నారు. తవ్వేకొద్దీ వారికి మరిన్ని ఆస్తుల వివరాలు లభ్యమవుతున్నాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ట్రస్ట్ నిర్వాహకుడు లోకేశ్ దాసాజీని కూడా అదుపులోకి తీసుకుని పలు రహస్య అంశాలపై ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు.