Baba Siddique Murder Case: బాబా సిద్ధిఖిని చంపిన నిందితుడు ఆ తరువాత కూడా అక్కడే ఉండి...

Update: 2024-11-12 11:30 GMT

Baba Siddique Murder Case: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖి హత్య కేసులో ముగ్గురు నిందితులు ప్రస్తుతం ముంబై పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసుల విచారణలో వారు చెబుతున్న సంచలన విషయాలు విని పోలీసులే ఖంగుతింటున్నారు.అందులో ముఖ్యమైనది ఏంటంటే.. బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివ కుమార్ గౌతం బాబా సిద్ధిఖిని కాల్చి చంపిన తరువాత కూడా అక్కడే చాలాసేపు గడపడం. సాధారణంగా మర్డర్ కేసుల్లో నిందితులు పోలీసుల కంట పడకుండా క్షణాల్లో అక్కడి నుండి పారిపోతుంటారు. కానీ శివ కుమార్ గౌతం మాత్రం ఘటనా స్థలంలోనే ఉండి ఆ తరువాత ఏం జరుగుతోందని చూస్తూ ఉన్నాడు.

అదెలా సాధ్యమైంది?

బాబా సిద్ధిఖి హత్యలో ముగ్గురు పాల్పంచుకున్నారు. వారిలో ప్రధాన నిందితుడు శివ కుమార్ గౌతం. మరో ఇద్దరిలో హర్యానాకు చెందిన గుర్మైల్ సింగ్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ ఉన్నారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ లను అరెస్ట్ చేశారు. కానీ శివ కుమార్ గౌతం పోలీసులకు చిక్కలేదు. దాంతో అతడు అక్కడి నుండి పారిపోయాడు అనే అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆ సమయంలో శివ అక్కడే ఉన్నారని తాజాగా పోలీసుల విచారణలో తేలింది. బాబా సిద్ధిఖిని షూట్ చేసిన తరువాత పోలీసులను తప్పుదోవ పట్టించడం కోసం శివ తన షర్ట్ మార్చుకున్నారు. ఆ తరువాత అక్కడే గుమిగూడిన జనంలోకి వెళ్లి వారిలో కలిసిపోయారు. ఆ జనంలోనే నిలబడి వారిలో ఒకరిగా మొత్తం సీన్ చూశారు.

ముంబై పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించసాగారు. కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహిస్తున్నారు. అదంతా అక్కడే నిలబడి చూసిన శివ ఆ తరువాత ఆటోలో ముంబైలోని కుర్లాకు వెళ్లారు. కుర్లా ఆ నిందితులు నివాసం ఉన్న ప్రాంతం. కుర్లా నుండి లోకల్ రైలులో థానెకు వెళ్లారు. అలా ముంబై పోలీసుల కంటపడకుండా తప్పించుకున్నారు.

శివ కుమార్ గౌతం ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రెచ్‌లో ఉన్నారని, అక్కడి నుండి నేపాల్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్లాన్ ప్రకారం శివను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. శివతో పాటు మరో నలుగురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులు అక్కడికి వెళ్లడంలో ఆలస్యమై ఉంటే ఆయన నేపాల్ పారిపోయే అవకాశం ఉండేదని తెలుస్తోంది.

బాబా సిద్ధిఖి మర్డర్‌కు ముందు అన్మోల్ బిష్ణోయ్ ఫోన్ చేశాడు

ముంబై పోలీసుల విచారణలో శివ అనేక విషయాలు చెబుతున్నారని తెలుస్తోంది. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ నుండి తనకు ఆదేశాలు అందినట్లు శివ అంగీకరించారు. బాబా సిద్ధిఖి, ఆయన కుమారుడు జీషాన్ సిద్ధిఖిలలో ఎవరు ముందుగా కనిపిస్తే వారిని షూట్ చేయాల్సిందిగా అన్మోల్ చెప్పినట్లు శివ వెల్లడించారు. అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం కెనడాలో ఉన్నారు. ఇండియా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో అన్మోల్ ఒకరు.

Tags:    

Similar News