GSLV Mark 3: మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైన ఇస్రో

GSLV Mark 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైంది.

Update: 2022-10-07 16:00 GMT

GSLV Mark 3: మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైన ఇస్రో 

GSLV Mark 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైంది. ప్రతిష్టాత్మక GSLV మార్క్-3 ని, రోదసిలోకి పంపేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 22న GSLV మార్క్- 3 భారీ ఉపగ్రహం అంతరిక్షంలోకి దూసుకెళ్లబోతోంది. ఇందుకు తిరుపతి జిల్లా రాకెట్ సిటీ శ్రీహరికోట షార్ లో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. GSLV మార్క్ 3 రాకెట్ ద్వారా 36 కమర్షియల్ ఉపగ్రహాలు నింగికి పంపనుంది ఇస్రో.

మరోసారి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో శాస్త్రవేత్తల హడావిడి మొదలైంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించే GSLV మార్క్ 3 ఉపగ్రహ వాహక నౌక ద్వారా వాణిజ్యపరమైన 36 ఉపగ్రహాలను రోదసీలోకితీసుకెళ్లబోతోంది. ఇందుకోసం తిరుపతి జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో. ఈ నెల 22న భారత భారీ ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకను అంతరిక్షంలోకి చేర్చనున్నారు. GSLV మార్క్ 3 పేరుతో ఇస్రో ఈ రాకెట్ ను రూపొందిస్తోంది.

GSLV మార్క్ 3 లాంటి భారీ ఉపగ్రహాలను ఇంతకుముందు కూడా ఈ ఇస్రో ప్రయోగించినప్పటికీ ప్రస్తుతం పూర్తి వాణిజ్య అవసరాల కోసం దీన్ని రూపొందించారు. పైగా ఎన్ఎస్ఐఎల్‌తో ఒప్పందం తర్వాత జరుగుతున్న తొలి బరువైన రాకెట్ ఇదే. దాదాపు 36 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి చేర్చడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌లు భారీగా వాణిజ్య లాభాలు ఆర్జించడానికి అవకాశం ఏర్పడింది.

GSLV మార్క్ 3 ప్రయోగానికి సంబంధించి శ్రీహరికోటలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గతంలో ప్రయోగించాల్సిన ఈ రాకెట్ వివిధ కారణాలతో వాయిదా పడి ఇప్పటికి సిద్ధమవుతోంది. రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఇరువైపులా ఉండే, రెండు ఘన ఇంధన బూస్టర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. కీలకమైన క్రయోజనిక్ ఇంజన్‌ను అమర్చాల్సి ఉంది. అత్యంత శీతల స్థితిలో ఉండే ఈ క్రయోజనిక్ దశ GSLV మార్క్ -3 లో ఎంతో కీలకమైనది. ఎల్ విఎం-3గా ప్రచారంలో ఉన్న ఈ ప్రయోగం ఎన్ఎస్ఐఎల్ తో పాటు ఇస్రోకు కూడా ఒక చారిత్రాత్మక మైలురాయిగా భావిస్తున్నారు.

ఈ భారీ ప్రయోగానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామానికి ఈ రెండు సంస్థలు శ్రీకారంచుట్టాయి. ఉపగ్రహాలు విడిచిపెట్టే ప్రదేశానికి సమీపంలో గ్రౌండ్ స్టేషన్ అందుబాటులో లేని కారణంగా అతి పెద్ద షిప్ లలో ఈ భూకేంద్రాన్ని వినియోగించుకోవడానికి శ్రీకారంచుట్టారు. ఈ నెల 1న చెన్నై నుంచి ఉపగ్రహాలను పసిగట్టే గ్రౌండ్ స్టేషన్ ను షిప్ ల ద్వారా అంటార్కెటికా వైపు మళ్లించినట్లు సమాచారం. ఈ నెల 14న ఇవి అక్కడికి చేరుకుంటే అనంతరం రాకెట్ ప్రయోగ సమయాన్ని నిర్ధారిస్తారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ నెల 22 న ఈ ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈలోగా మహేంద్రగిరి నుంచి క్రయో ఇంజన్ ను తీసుకొచ్చి ఉపగ్రహాన్ని పూర్తిగా అమర్చుతారు. ఆ తర్వాత 36 ఉపగ్రహాలను రాకెట్ శీర్షభాగంలో ఉంచి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. అంతరిక్షంలో లో ఎర్త్ ఆర్బిట్ లో ఈ ఉపగ్రహాల సమూహాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఇస్రోలోని వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ శాస్త్రవేత్తలు శ్రీహరికోటలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News