PSLV-C58: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్
PSLV-C58: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్
PSLV-C58: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ న్యూ ఇయర్ రోజున కొత్త చరిత్రను లిఖించింది. నూతన సంవత్సరంలో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ- సీ58 వాహకనౌక ద్వారా ఎక్స్‌పో - శాట్ శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అయింది. ఎక్స్‌పో రాకెట్‌ను నింగిలోకి పంపించి విజయవంతమైంది. ఇప్పటివరకు అమెరికా మాత్రమే అంతరిక్షంలోకి పంపిన ఇలాంటి శాటిలైట్‌ను ఇప్పుడు ఇస్రో నింగిలోకి పంపించింది. కృష్ణ బిలాలు.. న్యూట్రాన్స్ లాంటి ఖగోళ వస్తువుల నుంచి వెలువడే ఎక్స్ కిరణాల అధ్యయనానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. విశ్వంలో అత్యంత దేదీప్యమానంగా వెలుగొందుతున్న కాంతిపుంజాల రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. దాదాపు 5 నెలలపాటు కక్ష్యలో తిరగనున్న ఎక్స్‌పో శాట్ కీలకమైన సమాచారాన్ని సేకరించనుంది.
చంద్రయాన్ త్రీ విజయం తర్వాత అంతరిక్ష రంగంలో భారతదేశ ఖ్యాతి మరో స్థాయికి చేరుకుంది. ఈ ప్రయోగం సక్సెస్ తర్వాత ఇస్రో మరింత వేగంగా భవిష్యత్ ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మరో ప్రయోగాన్ని సక్సెస్‌ఫుల్‌గా కక్షలోకి ప్రవేశపెట్టింది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటిపై... అధ్యయనం చేసేందుకు ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఖగోళంలో కృష్ణ బిలాలు, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన X - కిరణాల అధ్యయనానికి ఇస్రో తొలిసారిగా పోలారిమెట్రి మిషన్ చేపట్టింది. పీఎస్‌ఎల్‌వీ- సీ 58 వాహకనౌక ద్వారా ఎక్స్‌పో - శాట్ శాటిలైట్‌ను ప్రయోగించింది. ఈ ఎక్స్‌పో శాట్ శాటిలైట్‌ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టింది.
విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమానమైన ప్రకాశంతో కూడిన 50 కాంతి పుంజాల మూలాలను పరిశోధించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. ఈ 50 కాంతి పుంజాల్లో కృష్ణబిలం, ఎక్స్‌రే జంట నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ నక్షత్రాలు, నాన్‌థర్మల్ సూపర్ నోవాల అవశేషాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగాన్ని భారత్ తొలిసారి చేపట్టింది. ఇంతకుముందు అమెరికా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2021లో నాసా ఇమేజింగ్ ఎక్స్‌రే పొలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్ ప్రయోగాన్ని అమెరికా నింగిలోకి పంపించింది.
కాగా ఈ శాటిలైట్‌ను యుఆర్ శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసింది. పొలారిమెట్రీ అనేది ఖగోళ వస్తువులు, తోక చుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని అంచనా వేయడానికి అనుమతించే శక్తివంతమైన సాధనం. ఎక్స్‌పో శాట్ మిషన్ తనలోని రెండు పేలోడ్ల ద్వారా ప్రకాశవంతమైన ఎక్స్ - కిరణాల మూలాల టెంపోరల్, స్పెక్ట్రల్, పోలరైజేషన్ లక్షణాలను ఏకకాలంలో అధ్యయనం చేయగలదు. ఇందులోని ప్రాథమిక పేలోడ్, ఎక్స్-కిరణాలతో పొలారి మీటర్ పరికరం ఫోటాన్ల మధ్యస్థ ఎక్స్ - రే శక్తి పరిధిలో ధృవణ స్థాయి, కోణాన్ని కొలవనున్నాయి. ప్రస్తుతం ఇస్రో చేపట్టిన ఈ ఎక్స్‌పో శాట్ శాటిలైట్ కనీసం ఐదేళ్ల పాటు తన పరిశోధనను నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది.