ISRO: అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో ముందడుగు

ISRO:అంతరిక్ష పరిశోధన విశ్వ వినువీధుల్లో దూసుకుపోతున్న ఇస్రో మరో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన హై ఫ్రీక్వెన్సీ యంత్రాన్ని ఆవిష్కరించబోతోంది.

Update: 2021-03-12 06:57 GMT

ఇస్రో ఇమేజ్ సోర్స్ (TheHansIndia)

ISRO: అంతరిక్ష పరిశోధన విశ్వ వినువీధుల్లో దూసుకుపోతున్న ఇస్రో మరో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన హై ఫ్రీక్వెన్సీ యంత్రాన్ని ఆవిష్కరించబోతోంది. భూ సమగ్ర పరిశీలనలో ISRO మరో ముందడుగు వేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూమిని అణువణువును చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్ మిషిన్ ను తయారుచేసింది ఇస్రో.

భూ ఉపరితల మార్పులను క్షుణ్ణంగా పరిశోధించే క్రమంలో ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ ఇస్రో మరో ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన నాసాతో కలసి సంయుక్తంగా రూపొందిస్తున్న ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ మిషన్‌ కోసం అత్యంత ఎక్కువ రిజల్యూషన్‌తో ఫొటోలు తీయడానికి ఉపకరించే సింథటిక్‌ అపెర్చ్యూర్‌ రాడార్‌ ను ఇస్రో విజయవంతంగా అభివృద్ధి చేసింది. అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ నుంచి అమెరికాలోని పాసడేనాలో ఉన్న నాసా జెట్‌ ప్రొపల్షన్‌ లాబొరేటరీకి దానిని పంపారు. అక్కడ రెండు బ్యాండ్‌లను అనుసంధానం చేస్తారు.

భూమిని మరింత నిశితంగా పరిశీలించడానికి నిసార్‌ మిషన్‌ను నాసా, ఇస్రో సంయుక్తంగా ప్రయోగించనున్న విషయం తెలిసిందే. భూ ఉపరితలంపై సెంటీ మీటర్‌ వైశాల్యం కన్నా చిన్న ప్రాంతంలో కూడా సంభవించే మార్పులను గుర్తించడానికి రెండు వైవిధ్య భరిత ఫ్రీక్వెన్సీలు ఎల్‌ బ్యాండ్, ఎస్‌ బ్యాండ్‌ ఉపయోగిస్తున్న మొట్టమొదటి శాటిలైట్‌ మిషన్‌ నిసార్‌ అని నాసా వర్గాలు తెలిపాయి.

నిసార్‌ మిషన్‌ ప్రయోగానికి సంబంధించి 2014 సెప్టెంబర్‌ 30న ఇస్రో, నాసా మధ్య భాగస్వామ్య ఒప్పందం జరిగింది. దీనిని 2022 ప్రథమార్థంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. అడ్వాన్స్‌ రాడార్‌ ఫొటోల ద్వారా భూ ఉపరితలంపై జరుగుతున్న మార్పులు, తదనంతరం సంభవించబోయే పరిణామాలను లెక్కించడం ఇస్రో లక్ష్యం. మంచు కరిగిపోవడం నుంచి భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు విరిగిపడటాలు మొదలగు ఉపద్రవాలకు గల కారణాలు, ఆ ప్రాదేశిక ప్రాంతాల్లోని పర్యావరణ మార్పులకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని నిసార్‌ సమకూరుస్తుంది. భూ ఉపరితలంలో వస్తున్న మార్పులు, అనంతర పరిణామాలను కొన్నేళ్ల పాటు బాగా అర్థం చేసుకోవడానికి నిసార్ మిషన్‌ సమాచారం ఉపయోగపడుతుందని నాసా వర్గాలు భావిస్తున్నాయి. 

Tags:    

Similar News