Amritpal Singh: అమృత్‌పాల్ వెనుక ఐఎస్‌ఐ!
Amritpal Singh: విదేశీ నిధులూ అందుతున్నట్లు సమాచారం
Amritpal Singh: ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్ వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ హస్తం, విదేశీ నిధుల ప్రమేయం ఉన్నట్లు బలంగా వినిపిస్తోంది. మాదకద్రవ్యాల ముఠాలతోనూ అమృత్‌పాల్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ఈ ముఠాలే మెర్సిడెజ్ బెంజ్ కారును సింగ్‌కు బహుమతిగా ఇచ్చాయనీ, ఆయుధ సహకారాన్ని ఐఎస్‌ఐ అందిస్తోందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. పోలీసులు ఛేజింగ్ లో తప్పించుకున్నప్పుడూ కూడా ఇదే కారులో సింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడికి ఓ ప్రైవేటు సైన్యం ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఐదుగురు వ్యక్తులపై 'జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇప్పటి వరకూ అమృత్ పాల్ సింగ్ పై ఆరు కేసులు నమోదు చేసి, 114 మందిని అరెస్టు చేశారు. జలంధర్‌లో లొంగిపోయిన నిందితుని బంధువు హర్జీత్‌సింగ్‌పైనా ఎన్‌ఎస్‌ఏ కేసు నమోదైంది. అతన్ని డిబ్రూగఢ్ జైలుకు తరలించనున్నారు. అమృత్‌పాల్‌ను అరెస్టు చేశాక అతనిపైనా ఎన్‌ఎస్‌ఏ కేసు నమోదు చేయనున్నారు పోలీసులు.
మరో వైపు అమృత్‌పాల్ ఆచూకి కోసం దర్యాప్తు బృందాల గాలింపు కొనసాగుతోంది. నాలుగు రోజులుగా అమృత్ పాల్ జాడ తెలుసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అతని భార్య కిరణ్‌దీప్ కౌర్.. కెనడా వీసా కోసం దరఖాస్తు చేసింది. దీంతో అమృత్‌పాల్ కూడా నేపాల్ మీదుగా కెనడాకు పారిపోయేందుకు ప్రయత్నించవచ్చని అనుమానిస్తున్నారు. సరిహద్దుల వద్ద తనిఖీలు, భద్రతను పటిష్ఠం చేయాలని కేంద్రం ఆదేశించింది.