రష్యన్ సేనల కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి

*కర్నాటక హవేరీ జిల్లాకు చెందినవాడిగా గుర్తింపు

Update: 2022-03-01 11:00 GMT

రష్యన్ సేనల కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి

Indian Student: ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో పేట్రేగిపోతున్న రష్యా దాడుల్లో.. ఉక్రెయిన్‌ సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం మొదలై ఆరు రోజులు అవుతుండగా.. ఇవాళ ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో భారత్‌కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి కర్ణాటక హవేరీ జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి నవీన్‌గా గుర్తించారు. ఈ మేరకు భారత విదేశాంగశా‌ఖ ధృవీకరించింది.

వైద్య విద్య కోసం భారత్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉక్రెయిన్ వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు కూడా వైద్య విద్యనభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. నవీన్ కూడా వైద్య విద్య కోసమే ఉక్రెయిన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ ఉదయం రష్యా సేనలు జరిపిన బాంబు దాడుల్లో నవీన్ మృతి చెందాడు.

ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న దాడుల్లో భారతీయ పౌరుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉదయం ఖార్కీవ్‌లో జరిపిన దాడుల్లో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ట్విటర్‌లో వెల్లడించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

మృతుడిని కర్ణాటకలోని హవేరి జిల్లా వాసి నవీన్‌గా గుర్తించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సదరు విద్యార్థి ఉక్రెయిన్‌లో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొంది. ఖార్కివ్‌లోని ప్రభుత్వ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా బాంబు దాడులకు పాల్పడింది. అయితే అవి గురితప్పి నవీన్‌ ఉంటున్న నివాస ప్రాంతంపై పడినట్లు తెలుస్తోంది.

తాజా ఘటన నేపథ్యంలో భారత్‌లోని ఉక్రెయిన్‌, రష్యా రాయబారులతో కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడారు. ఖార్కివ్‌ సహా ఇతర నగరాల్లోని భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టాలని రెండు దేశాలను కోరినట్లు ఎంఈఏ వెల్లడించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌, ఆ నగర పరిసర ప్రాంతాల్లో తీవ్ర పరిస్థితుల దృష్ట్యా ఆ నగరాన్ని వెంటనే వీడాలని ఈ ఉదయమే అక్కడి భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా రైళ్లు, ఇతర అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో కీవ్‌ను వీడి సరిహద్దులకు రావాలని భారత విద్యార్థులు, పౌరులకు సూచించింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఖార్కివ్‌లో భారత విద్యార్థి మృతిచెందినట్లు విదేశాంగ శాఖ వెల్లడించడం గమనార్హం.

Tags:    

Similar News