డ్రాగన్‌ కంట్రీకి ఇండియన్‌ నేవీ షాక్

Update: 2020-08-31 10:47 GMT

Indian Navy: గల్వాన్ దాడితో చైనాకు హెచ్చరిక పంపేందుకు భారత నేవీ అనూహ్య చర్యను చేపట్టింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా నౌకలను మినహా మరే ఇతర దేశ నౌకలను అనుమతించని ప్రాంతంలోకి యుద్ధనౌకను పంపి చైనాకు షాక్ ఇచ్చింది. భారత సైనికులపై దాడి జరిగిన వెంటనే యుద్ధనౌకను పంపిన నేవీ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. భారత యుద్ధనౌక చేరుకున్న ప్రాంతంలో 2009 నుంచి డ్రాగన్ కంట్రీ సైనికులను మోహరిస్తూ వస్తోంది. ఈ ప్రాంతంలో అజమాయిషీ చెలాయిస్తోంది. అలాంటి ఈ ప్రాంతంలోకి ఇండియన్ నేవీ నౌకను పంపటంతో చైనా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌకలు కూడా సంచరిస్తున్నాయి. అక్కడ మోహరించిన భారత యుద్ధనౌక అమెరికన్‌ వార్‌షిప్స్‌తో రెగ్యులర్‌ కాంటాక్ట్‌ను సాగించింది. ఇతర దేశాల నుంచి కూడా భారత యుద్ధనౌకకు సమాచారం అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సాగర జలాల్లో పోరాట సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత నౌకాదళం వ్యూహ రచన చేస్తోంది. మలాకా జలసంధి నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా యుద్ధనౌకల రాకపోకలను సమర్థంగా పర్యవేక్షించేందుకు జలాంతర నౌకలు, మానవరహిత వ్యవస్థలు, సెన్సార్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది.

ఇక ఇప్పటికే అండమాన్‌కు సమీపంలోని మలాకా జలసంధి దగ్గర భారీగా యుద్ధనౌకలను భారత్‌ మోహరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి చైనా నేవీ ఇదే మార్గాన్ని ఉపయోగించుకుంటోంది. వీటి కదలికలను కట్టడి చేయడానికి నేవీ నౌకలను మోహరించింది. శత్రుదేశం ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా సమాధానం చెప్పేందుకు ఇండియన్ నేవీ సమర్థంగా ఉందని అధికారులు తెలిపారు. మన దేశ నౌకల మోహరింపులతో హిందూ మహాసముద్ర ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడానికి వీలైందని వివరించారు.

Tags:    

Similar News