Third Wave: త్వరలో థర్డ్‌వేవ్ ముప్పు తప్పదు
Third Wave: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిక * నిర్లక్ష్యం వద్దని కేంద్రం, రాష్ట్రాలకు హితవు
Third Wave: లాక్‌డౌన్ ఎత్తేయగానే.. కరోనా ఖతమనే భ్రమలో ఉన్నారు జనం. భౌతిక దూరాన్ని దూరం చేశారు. శానిటైజర్ వాడకాన్ని ఎప్పుడో మానేశారు. ముఖానికి మాస్క్ ఉన్నా అది గడ్డానికే వేలాడుతుంది. ఇటు పొలిటికల్ పార్టీలు కూడా సభలు సమావేశాలంటూ వెర్రి వేషాలు వేస్తున్నాయి. కానీ ముందుంది ముస్సళ్ల పండుగ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యమంటూ ఐఎంఏ ప్రకటిస్తోంది.
ఫస్ట్‌వేవ్‌లో భయంతో అతిజాగ్రత్తలు పాటించాం. కరోనాను కాస్త కంట్రోల్ చేయగలిగాం. సెకండ్ వేవ్‌లో లైట్ తీసుకున్నాం. కానీ కరోనా తన తడాఖా చూపించింది. ఇప్పుడు మూడో వేవ్ ముచ్చటనే మరిచిపోయాం. విహారాలు, తీర్థయాత్రలు, పండుగలంటూ చెలరేగిపోతున్నాం. మరీ వైరస్ ఏమైనా వెర్రిదా.. దానికి తిక్కరేగితే ఊళ్లను ఖాళీ చేయిస్తుంది. ఆసుపత్రులను నింపేస్తుంది.
త్వరలో థర్డ్‌వేవ్ ముప్పుతప్పదని భారత వైద్యుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలెర్ట్‌గా ఉండాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కన్వర్ యాత్రకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. మరోవైపు ఇతర మతపర కార్యక్రమాలు జరిగిపోతూనే ఉన్నాయి.
మహమ్మారుల వ్యాప్తి తీరులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధారాలు, చరిత్రను పరిశీలిస్తే ముప్పు గ్యారంటీ అని ఐఎంఏ తేల్చేసింది. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల అలసత్వం వైరస్‌కు వెయ్యిఏనుగుల బలాన్ని ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. జనం పెద్దఎత్తున గుమిగూడే కార్యక్రమాలను నిరోధించాలని రాష్ట్రాలకు ఐఎంఏ సూచించింది. ఒక్క నెల రోజులపాటు జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ హెచ్చరిస్తోంది. లేదంటూ సూపర్ స్ర్పెడర్లు పెరిగిపోతే పరిస్థితిని ఊహించలేమని చెబుతోంది.