భారత కృత్రిమ వజ్రాలపై అమెరికన్ల మోజు.. 5 నెలల్లో 130 కోట్ల డాలర్ల డైమండ్ల ఎగుమతి
Artificial Diamonds: సానబట్టిన వజ్రాన్ని చూస్తే.. కళ్లు చెదురుతాయి.. అవి అత్యంత ఖరీదైనవి కావడంతో సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి.
Artificial Diamonds: సానబట్టిన వజ్రాన్ని చూస్తే.. కళ్లు చెదురుతాయి.. అవి అత్యంత ఖరీదైనవి కావడంతో సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. అయితే సహజమైన వజ్రాల సంగతి అలా ఉంచితే.. కృత్రిమంగా కూడా వజ్రాలను తయారుచేస్తారు. భారత్‌లో తయారుచేసే వజ్రాలకు అమెరికాలో విపరీతమైన గిరాకీ పలుకుతోంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఏకంగా 130 కోట్ల డాలర్ల విలువైన వజ్రాలను విక్రయించారంటే అమెరికన్లకు భారతీయ వజ్రాలంటే ఎంత పిచ్చో ఇట్టే అర్థమవుతోంది. అసలు కృత్రిమ వజ్రాలు ఎలా తయారవుతాయి? ఎందుకు భారతీయ వజ్రాలకు డిమాండ్? అనే ఆసక్తికరమైన అంశాలపై ప్రత్యేక కథనం.
ప్రపంచ వ్యాప్తంగా విక్రయించే 90 శాతం వజ్రాలు భారత్‌లోనే కట్ చేస్తారు ఇక్కడే సానబెడుతారు. సహజ వజ్రాల కన్నా ఇటీవల కృత్రిమ వజ్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లోని ప్రయోగశాల్లో తయారయ్యే కృత్రిమ వజ్రాలకు అమెరికాలో విపరీతమైన గిరాకీ పెరిగింది. బ్రిటన్, అస్ట్రేలియా వంటి దేశాల మార్కెట్లలోనూ డిమాండ్ పెరుగుతున్నా అవి అమెరికా తరువాతే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు సానబెట్టిన వజ్రాల ఎగుమతులు రెట్టింపయ్యాయి. ఇప్పటివరకు ఏకంగా 130 కోట్ల డాలర్ల విలువైన వజ్రాలను భారత్ విక్రయించింది. భవిష్యత్తులో 700 కోట్ల డాలర్ల నుంచి 800 కోట్ల డాలర్ల వజ్రాల విక్రయాలే లక్ష్యంగా మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక సహజ వజ్రాల వ్యాపారం కూడా ఏమాత్రం తక్కువ లేదు గతేడాది ఏకంగా 2వేల 400 కోట్ల డాలర్ల విలువైన సానబెట్టిన సహజ వజ్రాలను భారత్ ఎగుమతి చేసింది. యువతలో ఫ్యాషన్‌పై మోజు పెరుగుతుండడం వజ్రాలకు ఆదరణ పెరుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
వజ్రం పూర్తిగా కర్బనంతో తయారైనదని తెలిసినప్పటి నుంచి వాతావరణంలోని కర్బనంతోనూ వజ్రాన్ని తయారుచేయాలన్న ఆలోచన మొదలైంది. 1950 దశకంలో ట్రేసీ హాల్ అనే శాస్త్రవేత్త కృత్రిమ వజ్రాల తయారీని కనిపెట్టాడు. దీన్ని సింథటిక్ వజ్రాల నాణ్యత అంతంత మాత్రంగానే ఉండేది వివిధ దేశాలు ప్రయోగాలు చేస్తున్నా అప్పట్లో అంత విజయవంతం కాలేదు. కేవలం చిన్న సైజు వజ్రాలనే తయారు చేసేవారు. అయితే ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానం తోడయ్యింది. భూ గర్భంలో ఎలాగైతే అధిక ఉష్ణోగ్రత, అధిక పడీనమూలో వజ్రాలు తయారు అవుతాయో అచ్చం అదే వాతావరణాన్ని సృష్టించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వజ్రాం పొడిని కరిగించి గ్రాఫైట్ కర్బన్‌తో కలిసి 15వందల డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్ర ఒత్తిడికి గురిచేసి స్పటికీకరణ చెందేలా చేస్తారు. ఆ తరువాత పలుచటి వజ్రాన్ని విత్తనంగా ప్లాస్మా రియాక్టర్‌లో ఉంచుతారు. 800 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర కర్బన వాయువులను అధిక పీనడంతో చొప్పిస్తారు. దీంతో కనర్బనమంతా రియాక్టర్‌లోని వజ్రం పొర చుట్టూ చేరి ముడి వజ్రంలాగా గట్టిపడుతుంది. ఆ తరువాత దాన్ని పాలిస్ చేస్తారు. ఇలా తయారైనవి స్వచ్ఛమైన వజ్రాల కంటే మేలైనవిగా ఉంటున్నాయి. సహజంగా కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టే ప్రక్రియను కొన్ని వారాల్లో తయారు చేయడం సాధ్యమైంది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలన్నీ భారత్‌లో దొరికినవే. వజ్రాలను సానబెట్టడంలోనూ, రకరకాల నగలు తయారుచేయడంలోనూ భారత్ ప్రత్యేకతను చాటుతోంది. కృత్రిమ వజ్రాల తయారీలోనూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లేబొరేటరీలో తయారవుతున్న వజ్రాల్లో నాలుగోవంతు మన దేశంలోనే తయారవుతున్నాయి. ఎక్కువగా గుజరాత్‌లోని సూరత్‌లోనూ, ముంబైలోనూ వజ్రాల పరిశ్రమలు ఉన్నాయి. పదిహేనేళ్ల క్రితం ఒక క్యారట్ సింథటిక్ డైమాండ్ తయారీకి మూడు లక్షలు ఖర్చయ్యేదట. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత కేవలం 22వేల నుంచి 36 వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. దీంతో వజ్రాల ధర కూడా గణనీయంగా తగ్గింది. మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి రావడానికి కారణమైంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో వజ్రాలు కొనుగోలు తక్కువేనని తెలుస్తోంది.
సాధారణంగా వజ్రాల కోసం తవ్వకాలు జరిపితే ఆ ప్రాంతం భూమి దేనికీ పనికిరాకుండా బీడుగా మారుతుంది. భారీ గోతులు ఏర్పడుతాయి. పైగా పర్యావరణానికి జీవి వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒక క్యారట్ డైమండ్‌ను వెలికితీయడానికి 250 టన్నుల మట్టిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. 109 గ్యాలన్ల నీరు వృథా అవుతుంది. పైగా వేలాది కార్మికులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో చెమటోడ్చాల్సి ఉంటుంది. ప్రయోగశాలలో వజ్రాలను తయారుచేస్తే ఈ నష్టాలేవీ ఉండవు. ఒక్క విద్యుత్తు వినియోగం మాత్రమే అధికంగా ఉంటుంది. కృత్రిమ వజ్రాల తయారీ ఏ దశలోనూ పర్యావరణానికి హాని చేయవు. పైగా ధర తక్కువగా ఉండడంతో ఆర్టిఫిషియల్ డైమాండ్లపై యువత మోజు పడుతోంది.
ఏదేమైనా కృత్రిమ వజ్రాల ఉత్పత్తికి భారత్ కేంద్రంగా మారుతోంది ఇటీవల ఎగుమతులు ఊపందుకుంటున్నాయి. ప్రత్యేకంగా భారతీయ కృత్రిమ వజ్రాలకు అమెరికన్లు ఫిదా అవుతున్నారు. మంచి నాణ్యమైన వజ్రాలు, వివిధ రంగుల్లో లభిస్తుండడంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.