Indian Covid Variant: 44 దేశాల్లో భారత్ రకం స్ట్రెయిన్
Indian Covid Variant:భారత్ లో వృద్ధి చెందిన బి.1.617 వైరస్ రకం ప్రపంచ వ్యాప్తంగా 44దేశాల్లో గుర్తించారు.
Indian Covid Variant: భారత్‌లో కరోనా వ్యాప్తి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లో వృద్ధి చెందిన బి.1.617 వైరస్ రకం ప్రపంచ వ్యాప్తంగా 44దేశాల్లో గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రస్తుతం రెండో దశ వ్యాప్తికి కారణమవుతోన్న B.1.617 వేరియంట్‌ను భారత్‌లో తొలిసారిగా అక్టోబరులోనే గుర్తించారని డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ విభాగం చీఫ్ మారియా వాన్ కేర్ఖేవే తెలిపారు. ఈ స్ట్రెయిన్ తొలిసారిగా భారత్ లో బయటపడగా... 44 దేశాలు అప్‌లోడ్ చేసిన 4500 నమూనాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. భారత్ వెలుపల.. యూకేలో ఈ వైరస్ రకం కేసులు అత్యధికంగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
గతవారం భారత్ స్ట్రెయిన్‌ను ఆందోళనకర రకంగా వర్గీకరించిన విషయం తెలిసిందే. దీంతో బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన ప్రమాదకర వైరస్ రకాల జాబితాలో బి.1.617ను కూడా చేర్చింది. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి సాధారణ కరోనా వైరస్‌తో పోలిస్తే తీవ్రంగా ఉందని, చాలా దేశాల్లో ఈ రకం వల్ల కేసులు వేగంగా పెరిగాయని, అందుకే దీన్ని ఆందోళనకర జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఈ స్ట్రెయిన్ మూలంగానే భారత్‌లోనూ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు పేర్కొంది.
అయితే దీంతో పాటు భారత్‌లో వైరస్ ఉద్దృతికి ఇతర కారణాలూ ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. ఏప్రిల్ చివరి నాటికి బి.1.617లోని బి.1.617.1, బి.1.617.2 రకాలు భారత్‌లో గుర్తించినట్లు తెలిపింది. దీంతో పాటు బ్రిటన్‌లో వెలుగుచూసిన బి.1.1.7 రకం స్ట్రెయిన్ కూడా దేశంలో వేగంగా వ్యాపిస్తోందని తెలిపింది. కరోనాను మరిచి మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించడం, అక్కడ భౌతిక దూరం, మాస్క్ వంటి నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందని అభిప్రాయపడింది.