India Corona Updates: గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,14,835 కరోనా కేసులు
India Corona Updates: ఒక రోజులో మూడు లక్షలకు పైగా కేసులు, రెండు వేలకు పైగా మరణాలతో దేశంలో మహమ్మారి బుసలు కొడుతోంది.
India Corona Updates: దేశంలో కరోనావైరస్ ప్రళయం సృష్టిస్తోంది. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో ప్రభుత్వాలను ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. దీంతో నిత్యం రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం గత 24 గంటల్లో (బుధవారం) కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా 3,14,835 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2,104 మంది మరణించారు.
దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి అత్యధిక కోవిడ్ -19 కేసులు మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,59,30,965 (1.59 కోట్లు) కు చేరగా.. మరణాల సంఖ్య 1,84,657 కి పెరిగింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసుల సంఖ్య లక్ష నుంచి 3 లక్షల దాటడం ఈ మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లో కేసులు నమోదయ్యాయి.
కాగా.. నిన్న కరోనా నుంచి 1,78,841 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,34,54,880 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22,91,428 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 13,23,30,644 డోసులను లబ్ధిదారులకు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 22లక్షలకు పైబడగా.. ఆ రేటు 13.82 శాతానికి పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే 1,78,841 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దాంతో కోటీ 34లక్షల మంది వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 85.01 శాతానికి పడిపోయి కలవరపెడుతోంది. మరోవైపు, నిన్న 22,11,334 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. మొత్తంగా 13.23 కోట్ల మంది టీకా తీసుకున్నారు. ఒకానొక దశలో అగ్రదేశం అమెరికాలో మాత్రమే మూడులక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఆ తరవాత ఆ స్థాయి విజృంభణ భారత్‌లోనే కనిపిస్తుండటం భయాందోళనకు గురిచేస్తోంది.