India Coronavirus Updates: భారత్ లో కొనసాగుతోన్న కరోనా మరణమృదంగం

India Coronavirus Updates: గత 24 గంటల్లో 3,32,730 కరోనా కేసులు నమోదు కాగా, 2వేలకు పైగా మరణాలు సంభవించాయి.

Update: 2021-04-23 05:44 GMT

India Coronavirus updates:(File Image)

India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. నిత్యం లక్షల్లో కోవిడ్-19 కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని వైరస్ సంక్రమణ భారత్‌లో కనిపిస్తుండటం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు పరిస్థితి తీవ్రతను కళ్లకుకడుతున్నాయి.

తాజాగా గత 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 17,40,550 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వాటిలో 3,32,730 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2,263 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,63,695 (1.62 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,86,920 కి చేరింది. ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో కోవిడ్ ప్రారంభం నాటినుంచి అత్యధిక కోవిడ్ -19 కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.

నిన్న కరోనా నుంచి 1,93,279 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,36,48,159 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 24,28,616 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 83.92 శాతం ఉండగా.. మరణాల రేటు 1.15 శాతం ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 13,54,78,420 డోసులను లబ్ధిదారులకు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News