Corona Cases in India: భారత్‌లో కరోనా విలయతాండవం

Corona Cases in India: రోజుకు రెండు లక్షలకుపైగా కోవిడ్ కేసులు నమోదు * రోజు వారీ మరణాలు దాదాపు 1500

Update: 2021-04-19 06:10 GMT

కరోనా (ఫైల్ ఇమేజ్)

Corona Cases in India: భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు రెండు లక్షలకుపైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ మరణాలు దాదాపు 1500 దాటుతుండటంతో అందరిలోనూ తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. అయితే.. ఎంతటి భయానకమైన మహమ్మారి వైరస్‌ అయినా ఏదో ఒక దశలో పతాకస్థాయికి చేరి క్రమంగా తీవ్రత తగ్గిపోతుంది. కానీ మొదటివేవ్‌లో మన దేశంలో తొలి కేసు జనవరిలో నమోదు కాగా సెప్టెంబరు 26న పతాకస్థాయికి చేరింది. ఆ తర్వాత క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతూ వచ్చి ఫిబ్రవరి రెండో వారంలో రోజువారీ కేసుల సంఖ్య 9 వేల లోపునకు పడిపోయింది. మార్చి మొదటివారం నుంచి మొదలైన సెకండ్‌వేవ్‌ ఇప్పుడు బీభత్సం సృష్టిస్తోంది. రానున్న పది రోజులూ దేశంలో కరోనా విలయ తాండవం చేసే ప్రమాదం ఉందని అత్యంత కీలకమైన ఈ పదిరోజులూ అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో కేసులు ఎంత వేగంగా పెరిగాయో అంతే వేగంగా తగ్గిపోతాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ క్రెడిట్‌ సూయిస్‌ అధ్యయనంలో తేలింది. ఏప్రిల్‌ చివరినాటికి దేశ ప్రజల్లో 40 శాతం మందిలో కరోనా యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయని ఆ 40 శాతం మందిలో 28 శాతం మందికి కరోనా ఇన్ఫెక్షన్ల వల్ల, మరో 12 శాతం మందికి టీకాల వల్ల యాంటీబాడీస్‌ ఉత్పత్తి అవుతాయని క్రెడిట్‌ సూయిస్‌ తెలిపింది. ఫలితంగా కేసుల సంఖ్య, కొవిడ్‌ మరణాల రేటులో గణనీయమైన తగ్గుదల నమోదవుతుందని వెల్లడించింది. కానీ వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతుండడంతో మరణాల సంఖ్య సెప్టెంబర్‌ మునుపటి స్థాయికి చేరుకుంది.

కేసులు పెరుగుతుండడంతో కొద్దిరోజులుగా ప్రజలు బయటకు రావడం తగ్గించినట్టు క్రెడిట్‌ సూయిస్‌ తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల కూడా కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కేసుల సంఖ్య ఏప్రిల్‌ 15 నుంచి మే 15 నడుమ పతాకస్థాయికి చేరనుందని ఓ యూనివర్సిటీ శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. ఇక దేశంలో కరోనా కేసులపై గత ఏడాది అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం కేసులు ఏప్రిల్‌ 20 నాటికి పతాకస్థాయికి చేరుతాయని పేర్కొంది. మే నెలాఖరు నాటికి వైరస్‌ తీవ్రత తగ్గుతుందని కూడా ఆ బృందం వెల్లడించింది.

దేశంలో కేసులు ఆగస్టు నుంచి వేగంగా పెరిగి, సెప్టెంబరులో పతాకస్థాయికి చేరి, ఫిబ్రవరి నాటికి తగ్గుతాయని వెల్లడించారు. వారు చెప్పినట్టుగానే జరిగింది. వారే ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ అంచనాలనూ వెల్లడించారు. ఏప్రిల్‌ 19 నుంచి మే 17 వరకూ కేసులు పెరుగుతూ వస్తాయని, మే రెండో వారం లో పతాకస్థాయికి చేరుకుంటాయని మిచిగాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌హెల్త్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వారి అంచనా మేరకు జూన్‌ నుంచి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశముంది. 

Tags:    

Similar News