India Purchase Weapons from Russia: భారత వాయుసేనకు మరిన్ని అస్త్రాలు.. రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలు..
India Purchase Weapons from Russia: మన దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. రక్షణశాఖ అమ్ముల పొదిలోకి మరిన్ని అధునాతన అస్త్రాలను చేర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటికే జూలై నెలాఖరుకు తొలి విడతగా 6 రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోనుండగా తాజా మరో కీలక ఒప్పందం చేసుకుంది. రష్యా నుంచి 33 కొత్త యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోద ముద్రవేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కో సందర్శించి వచ్చిన వారంలోనే 33 విమానాల కొనుగోలుకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది.
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు ప్రస్తుత విమానాల అధునీకరణకు అనుమితిస్తూ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో రూ.38,900 కోట్ల విలువైన ఆయుధ సామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం లభించింది.
రష్యా నుంచి 12 సుఖోయ్ యుద్ధ విమానాలతో పాటు మరో 21 మిగ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం మన వద్ద ఉన్న 59 మిగ్-29 విమానాలను ఆధునీకరించనుంది. అత్యాధునిక ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలుతో పాటు ప్రస్తుత యుద్ధ విమానాల ఆధునీకరణకు రూ.7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా, రూ.10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది
భారత వాయుసేన, నౌకాదళానికి అదనంగా 248 అస్త్ర ఎయిర్ టూ ఎయిర్ మిసైల్స్‌ను సమకూర్చనుంది. వెయ్యి కి.మీ. దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల లాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ తయారీకి రక్షణశాఖ ఆమోద ముద్రవేసింది. ఈ క్షిపణులను డీఆర్డీవో తయారుచేయనుంది. ఇవి త్రివిద దళాలకు చేరితే భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.