పాకిస్తాన్ అభ్యర్థనను భారత్ పెద్ద మనసుతో మన్నించింది. పాక్ ప్రధాని ఈ నెల 23న శ్రీలంక పర్యటనకు వెళ్ళనున్నారు. ఇందుకోసం ఆయన విమానాన్ని భారత గగన తలం నుంచి వెళ్ళేందుకు అనుమతి కోరింది పాక్ ప్రభుత్వం. ఎటువంటి ఆంక్షలు లేకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన గగన తలం నుంచి శ్రీలంక వెళ్ళేందుకు భారత్ అనుమతించింది.
అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం దేశాధినేతల విమానాలు ఇతర దేశాల గగనతలం గుండా వెళ్లితే దానికి అనుమతి తీసుకోవాలి. అయితే గతంలో భారత విమానాలు తమ దేశ గగనతలం మీదుగా వెళ్లకుండా పాకిస్తాన్ నిషేధం విధించింది. ప్రధాని మోడీ అమెరికా, సౌదీ అరేబియాకు వెళ్ళే సమయంలో తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్థాన్ అనుమతించలేదు. 2019లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ యూరప్ పర్యటన సందర్భంగా కూడా పాక్ అనుమతించలేదు. పాకిస్తాన్ సర్కార్ మనపట్ల చూపిన శత్రువైఖరిని పట్టించుకోకుండా భారత్ గగనతలం గుండా ఇమ్రాన్‌ఖాన్ విమానం వెళ్ళడానికి అనుమతించింది.