Black Day: రైతుల 'బ్లాక్ డే' కి పెరుగుతోన్న మద్దతు

Black Day: ఈనెల 26 కి ఢిల్లీలో చేస్తున్నరైతు ఉద్యమానికి 6నెలలు కాగా, మోదీ పాలనకు 7ఏళ్లు పూర్తి కానున్నాయి.

Update: 2021-05-24 06:57 GMT
రైతుల నిరసన (ఫైల్ ఇమేజ్)

Black Day: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసన కార్యక్రమం చేపట్టి 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 26న 'బ్లాక్‌ డే' పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అదే రోజు ప్రధానిగా నరేంద్ర మోదీ పాలనకు ఏడేళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భాన్ని 'బ్లాక్ డే'(చీకటి రోజుగా) గుర్తిస్తూ రైతు సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. మే 26న గ్రామాలు మొదలుకొని ఢిల్లీ దాకా అన్ని చోట్లా నల్ల జెండాలతో నిరసనలు తెలపాలన్నకిసాన్ మోర్ఛా పిలుపునకు దేశంలోని 12 ప్రతిపక్ష పార్టీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంతులు ఉమ్మడిగా సంపూర్ణ మద్దతు పలికాయి.

ఓ వైపు దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్నా రైతులు తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో కొవిడ్‌ వ్యాప్తికి ఆందోళన చేస్తున్న రైతులు కారణమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను గుర్నామ్‌సింగ్‌ ఖండించారు. ప్రభుత్వమే సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలు గుమిగూడడానికి కారణమయ్యిందని గుర్తుచేశారు. ఇప్పుడు తమను తప్పుబట్టడం సరికాదన్నారు. ఇప్పటికీ తాము ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. ఇదే విషయమై 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సైతం ప్రధాని మోదీకి శుక్రవారం లేఖ రాసింది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హరియాణలోని కర్నల్‌ జిల్లా నుంచి పెద్దఎత్తున రైతులు దిల్లీకి తరలివెళ్లారు. భారత్‌ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత గుర్నామ్‌ సింగ్‌ నేతృత్వంలో వందలాది వాహనాల్లో వీరంతా ఆదివారం దిల్లీకి బయల్దేరారు. 'బ్లాక్‌ డే' నిరసనలో భాగంగా వారంపాటు దిల్లీ సరిహద్దుల్లో సామూహిక భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. పంజాబ్‌ నుంచి కూడా భారీగా రైతులు బయల్దేరారు. ఈ సందర్భంగా రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలపనున్నారు. ఎస్‌కేఎం పిలుపునకు 12 ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనపై ఆయా పార్టీల నేతలు సంతకాలు చేశారు. ఇందులో పలువురు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తోపాటు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, సీపీఐ నేత డి.రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News