భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. విడిచి వెళ్తుందన్న అనుమానంతో చెయ్యి నరికేసిన భర్త!
West Bengal: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఈ రోజుల్లో అంత తేలికైన పని కాదు ఉద్యోగం రావడం అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి.
West Bengal: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఈ రోజుల్లో అంత తేలికైన పని కాదు ఉద్యోగం రావడం అంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఇంట్లో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా సంతోషంలో మునిగిపోతారు. కానీ ఓ భర్త మాత్రం తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే సంతోషించాల్సింది పోయి కక్ష్య పెంచుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో తన భార్య తనను విడిచి వెళ్లిపోతుందేమోనని అనుమానం పెంచుకున్నాడు. చివరికి ఆమె చేయిని నరికేశాడు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లా కోజల్సా గ్రామానికి చెందిన షేర్ మహమ్మద్-రేణు ఖాతున్ భార్యాభర్తలు. దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో నర్సింగ్‌లో శిక్షణ పొందుతున్న రేణు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. మరోవైపు, రేణు ఉద్యోగం చేయడం భర్త షేర్ మహమ్మద్‌కు ఇష్టం లేదు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో షేర్ మహమ్మద్ పదునైన ఆయుధంతో భార్య కుడి చేయిని నరికేశాడు. ఆపై పరారయ్యాడు. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చేయిని మొత్తం తొలగించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.