Coronavirus: మహారాష్ట్రలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా

Coronavirus: కరోనా తొలినాళ్లలోని పరిస్థితుల కంటే ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి

Update: 2021-03-29 02:51 GMT
కరోనా వైరస్(ఫైల్ ఫోటో)

Coronavirus: మహారాష్ట్రలో మళ్లీ కథ మొదటికొచ్చింది. కరోనా తొలినాళ్లలోని పరిస్థితుల కంటే ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత రికార్డులు బద్దలవుతూ..నమోదవుతోన్న రోజువారి కేసులు మహారాష్ట్రలో కల్లోలం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న కొత్త పాజిటివ్ కేసుల్లో 60 నుంచి 80 శాతం మహారాష్ట్రలోనే నమోదవుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

నిన్న దేశవ్యాప్తంగా 62వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదైతే.. మహారాష్ట్రలోనే 40 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్ వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27 లక్షల 13 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో ప్రతీ రోజూ 60శాతానికి పైగా మహారాష్ట నుంచే వస్తున్నాయి. ఈ వారంలో నమోదైన కేసుల పాజిటివ్‌ రేటు కూడా అత్యధికంగా ఉంది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 5శాతం ఉంటే.. మహారాష్ట్రలో దాదాపు 23 శాతంగా ఉంది.

గత పదిరోజుల నుంచి రాష్ట్రంలో కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. వారం రోజుల్లోనే లక్ష మందికి కరోనా నిర్ధరణ కావటం కలకలం రేపుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధించింది. అయిదుగురి కంటే ఎక్కువ మంది ఒకేచోట గుమిగూడటాన్ని నిషేధించింది. పండగలు, శుభకార్యాలతో పాటు రాజకీయ, మతపరమైన ర్యాలీలు, కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేసింది.

ఇప్పటికే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేస్తున్నారు అధికారులు. అయినా రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గలేదు. దీంతో ప్రభుత్వం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం ఉద్ధవ్ థాక్రే.

రోజుకి 40 వేల కేసులు దాఖలయ్యే పరిస్థితులు ఉండటంతో లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదని కొవిడ్ 19 టాస్క్‌ఫోర్స్‌ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ఆర్థిక రంగంపై పెను భారం పడకుండా లాక్‌డౌన్‌ అమలు చేయడానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికారుల్ని ఆదేశించారు. మార్కెట్లన్నీ మూసేయకుండా కఠినమైన ఆంక్షలు విధించేలా లాక్‌డౌన్ అమలు చేయాలన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటన చేసినప్పుడు ప్రజల్లో ఎలాంటి గందరగోళం లేకుండా స్పష్టత ఉండాలని చెప్పారు. 

Tags:    

Similar News