Maharashtra CM: దేవేంద్ర ఫడ్నవీస్ ఎలా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు
Maharashtra CM: దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ శాసనసభపక్ష నాయకుడిగా డిసెంబర్ 4న ఎన్నుకున్నారు. మహారాష్ట్ర సీఎంగా ఆయన డిసెంబర్ 5న ఆజాద్ మైదానంలో ప్రమాణం చేయనున్నారు.
Maharashtra CM: దేవేంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ శాసనసభపక్ష నాయకుడిగా డిసెంబర్ 4న ఎన్నుకున్నారు. మహారాష్ట్ర సీఎంగా ఆయన డిసెంబర్ 5న ఆజాద్ మైదానంలో ప్రమాణం చేయనున్నారు.
నిజానికి, అంతకు ఆరు నెలల ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతి దారుణంగా దెబ్బతింది. కానీ, నిరాశ చెందకుండా పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగారు. పార్టీ నాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమిని విజయం దిశగా నడిపించారు. ఈ విజయంతో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి మహారాష్ట్ర సీఎం పగ్గాలు చేపడుతున్నారు.
ఇదిలావుంటే, ఏక్ నాథ్ షిండే ఇంకా అసంతృప్తిలో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి. షిండే అసంతృప్తిని బీజేపి ఎలా చల్లారుస్తుందనేదే ప్రస్తుతానికి ఉత్కంఠ రేపుతోంది.
మహా సస్పెన్స్‌కు ముగింపు పలికిన బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో మహాయుతి కూటమి 235 స్థానాల్లో గెలిచింది. ఇందులో బీజేపీ ఒంటరిగా 132 స్థానాలు దక్కించుకుంది. ఆ పార్టీ 149 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన (ఏక్‌నాథ్ సిండే) 57 సీట్లు, ఎన్ సీ పీ (అజిత్ పవార్ ) వర్గం 41 సీట్లను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి పదవి కోసం అభ్యర్ధి ప్రకటనకు 10 రోజులు సమయం తీసుకున్నారు.
బీజేపీ అగ్రనాయకులతో ఏక్‌నాథ్ షిండే (శివసేన) వర్గం, ఎన్ సీ పీ (అజిత్ పవార్ ) వర్గం నాయకులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్ షిండే వదులుకోవడానికి కొంత అయిష్టతను వ్యక్తం చేసినట్టుగా ప్రచారం సాగింది. సీఎం పదవిని వదులుకుంటున్నందున డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన పదవులు కావాలని షిండే పట్టుబట్టినట్టారని కూడా వార్తలు వచ్చాయి.
గత నెలలో అమిత్ షాతో సమావేశం ముగిసిన తర్వాత మహాయుతి సమావేశం అర్ధాంతరంగా రద్దైంది. అనారోగ్య కారణాలతో షిండే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడే పార్టీ నాయకులను కలిశారు. ఈ పరిణామాలను బీజేపీ నాయకత్వం నిశితంగా పరిశీలించింది. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదమేనని ప్రకటించిన షిండే ఆ తర్వాత ఆయన వ్యవహరించిన తీరు తనకు అసంతృప్తి ఉందనే సంకేతాలు ఇచ్చింది. డిసెంబర్ 3న సాయంత్రం దేవేంద్ర ఫడ్నవీస్ షిండేతో భేటీ అయ్యారు. పదవుల పంపకంపై ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరిగాయి. ఈ భేటీతో షిండే సంతృప్తి చెందారని కమలం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో ఫడ్నవీస్‌ను శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ డిసెంబర్ 5న ప్రమాణం చేయనున్నారు.
ఎవరెవరికీ ఏ పదవులు?
ముఖ్యమంత్రి పదవితో పాటు హోంమంత్రి, స్పీకర్ పదవులను బీజేపీ తీసుకోనుంది. ఎన్ సీ పీ - అజిత్ పవార్ వర్గానికి , శివసేన - ఏక్ నాథ్ షిండే వర్గానికి డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వనున్నారు. అర్బన్ డెవలప్‌మెంట్, రెవిన్యూ మంత్రి పదవులు కూడా ఈ పార్టీలకు కేటాయించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో 43 మందికి మంత్రి పదవులు ఇవ్వవపాచ్చు. అయితే ఇందులో 21 పదవులు బీజేపీ తీసుకోనుంది. శివసేన – షిండే వర్గానికి 12, ఎన్‌సీపీ 10 మంత్రి పదవులు దక్కించుకోనుంది.
మూడోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్
దేవేంద్ర ఫడ్నవీస్ మొదటిసారి 2014లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగారు. మళ్ళీ 2019 నవంబర్ లో రెండోసారి సీఎం అయ్యారు. అయితే, ఆ సందర్భంలో ఆయన పదవి మూన్నాళ్ల ముచ్చటే అయింది. అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్, కాంగ్రెస్ కూటమితో కలిసి మహా వికాస్ అఘాడీని ఏర్పాటు చేసింది. దీంతో మెజారిటీ కోల్పోయిన ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు.
ఆ తరువాత శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 29న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, మూడేళ్ళకే ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. 2022లో ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీని చీల్చి సొంత కుంపటి పెట్టుకోవడంతో ఉద్ధవ్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏక్ నాథ్ షిండే 2022 నవంబర్ లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన క్యాబినెట్ లో దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
గత నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుత కూటమికి లెజిస్లేటర్ పార్టీ నేతగా ఎన్నికైన ఫడ్నవీస్‌కు మూడోసారి సీఎం పదవిని అందుకునే అవకాశం లభించింది. శివసేనకు చెందిన మనోహార్ జోషి తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన రెండవ నేత ఫడ్నవీస్.
ఏబీవీపీ కార్యకర్త నుంచి మహారాష్ట్ర సీఎం దాకా...
చిన్నతనంలోనే ఫడ్నవీస్ కు ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఏర్పడ్డాయి. చదువుకునే రోజుల్లో ఏబీవీపీలో క్రియాశీలకంగా ఆయన పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. లా డిగ్రీ పూర్తి చేశారు. 21 ఏళ్ల వయస్సులోనే నాగపూర్ మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. 1997లో నాగపూర్ మేయర్ గా ఆయన ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయస్సు 27 ఏళ్లు. నాగపూర్ కార్పోరేషన్ మేయర్ గా ఆయన రెండుసార్లు బాధ్యతలు నిర్వహించారు.
1999 లో నాగపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా ఆయన ఐదుసార్లు ఇదే స్థానం నుంచి గెలిచారు. బీజేపీ వార్డు కన్వీనర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరకు ఎదిగారు. కేరళ రాష్ట్ర బీజేపీ ఇంచార్జీగా పనిచేశారు. బీహార్, గోవాకు 2020-21 లో ఇంచార్జీగా ఉన్నారు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడిగా 2013 నుంచి 14 వరకు పనిచేశారు. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్న సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. దేశానికి నాగపూర్ ఇచ్చిన బహుమతి ఫడ్నవీస్ అంటూ మోదీ ఫడ్నవీస్ గురించి ప్రశంసలు కురిపించారు. మోదీ, అమిత్ షాలకు ఫడ్నవీస్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అందుకే మహారాష్ట్ర సీఎం పదవికి ఫడ్నవీస్ ను ఆ పార్టీ ఎంపిక చేసింది.
ఫడ్నవీస్ జీవితాన్ని మలుపు తిప్పిన సరస్వతి విద్యాలయం
చిన్నతనంలో ఇందిరా కాన్వెంట్ స్కూల్లో చేరేందుకు ఫడ్నవీస్ నిరాకరించారు. తన తండ్రికి జైలు జీవితం ప్రసాదించిన ఇందిరా పేరుతో ఉన్న స్కూల్ లో తాను చదివేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయనను సరస్వతి విద్యాలయంలో చేర్పించారు. ఇదే స్కూల్ లో చేరడం ఆయనను రాజకీయాల వైపు మళ్లించింది. ఏబీవీపీ నాయకులతో సంబంధాలు ఈ స్కూల్ లోనే కలిశాయని చెబుతుంటారు. ఈ స్కూల్లో చేరడమే ఆయన జీవితానికి టర్నింగ్ పాయింట్ అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.